పుట:Jeevasastra Samgrahamu.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొప్పలవలె నొకవైపున లోటుగను, రెండవవైపున ఎత్తుగను ఉండును. ఈదొప్పల రెంటియొక్క లోపలివైపులు ఒక దాని నొకటి యెదుర్కొనునట్లు జేరుటచేత నా పెదవుల మధ్యనుండు రంధ్ర మేర్పడును. ఈ పెదవికణముల లోపలిగోడలు మిక్కిలి బలముగలవి. ఇవి తమ యిచ్చవచ్చినట్లు పెద్దవి చిన్నవి కాగల సామర్థ్యము గలవి. అవి పొడుగుగ నెదిగినప్పుడు రెండు పెదవులును దగ్గిరబడి వాని మధ్యరంధ్రము మూసికొనిపోవును. పెదవులు చిన్నవైనప్పుడు వాని లోపలివైపున దొప్పలవలె నుండుగుంటలేర్పడి రెండుదొప్పల గుంటలును జేరి రంధ్ర మగును. ఈరంధ్రమే నోరు.

ఈ రంధ్రములు ఆకునందలి మృదుకణముల గుల్లలోని రంధ్రములతో సంబంధము గలవని చెప్పియుంటిమి. ఈరంధ్రములు తెరవబడినప్పుడు ఆకునందలి నీరు ఆవిరిరూపమున గాలిలోనికి బోవుచుండును. అవి మూయబడియుండినయెడల ఆకునందలి నీరు ఇగిరిపోనేరదు. ఇట్టిసాధనములచే ఆకులు చెట్టువేళ్లచే పీల్చబడిన నీటిలో తమకు కావలసినంతవరకు నుంచుకొని మిగిలిన నీటిని ఆవిరిగా గాలిలోనికి విడచివేయును.

వర్ష కాలమునందు చెట్లకు నీరు అధికమైనప్పుడు తమకుకావలసిన దానికంటె హెచ్చుగనుండు నీటిని ఆవిరిరూపమున విడుచు నిమిత్తమై వృక్షములు తమ యాకులయందలి నోళ్లను ఆవులించి నట్లుగా తెరచుకొనియుండును. వేసవికాలమునందు తమలోనుండు నీరు ఆవిరియైపోకుండ దాచికొనునిమిత్తమై తమ నోళ్లను మూసికొనియుండును.