పుట:Jeevasastra Samgrahamu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండుప్రక్కలను, విల్లువలె వంగియుండు స్వచ్ఛమైన సన్నని పట్టెలు రెండు ఒకదాని కొక టెదురుగా కన్పట్టును. ఈపట్టెలలో హరితకములుండవు (17-వ పటములో C-చూడుము). మూలపదార్థమునందలి రెండవభాగములోగూడ హరితకములుండవు. కాని దానియందు నిర్ణయమైనయాకారములేని స్వచ్ఛమైన అణువులుగలవు. అందు కొన్ని జీవస్థానములని తోచుచున్నది (17-వ పటములో D-లో జీ). అతిశీతలముగా నుండిన దప్ప, యీభాగమునందలి మూలపదార్థ మెల్లప్పుడు మిక్కిలి చురుకుగ ఒకవైపున మీదికిని రెండవవైపున క్రిందికిని పరుగెత్తుచుండును (C-లో బాణపుగుర్తులు చూడుము). పైకిపోవు ప్రవాహమునకును, క్రిందికి వచ్చు ప్రవాహమునకును మధ్య, పైని జెప్పబడిన స్వచ్ఛమైన పట్టెలు సరిహద్దులుగా నుండును. ఇందుండు జీవస్థానపు తునకలు మిక్కిలి వడిగా తమతమపనులను నెరవేర్చుకొనునిమిత్తమై జనసమ్మర్దముగల పట్టణపు రాజవీధినిబోవు బాటసారులు ఎవరిదారిని వారు ఇతరులతో సంబంధములేకుండ పరుగులెత్తు చుండునట్లు ఎల్లప్పుడును చరచర తిరుగుచుండును. కణకవచము యొక్క లోపలితట్టున మూలపదార్థ మిట్లు గిరగిర తిరుగుచుండుట వృక్షజాతికణములయందు తరుచుగ జూచుచుందుము. అన్నివైపులను ఆవరించి మూసివేసినదళమైన కణకవచముయొక్క ఆటంకముచే, స్వభావసిద్ధముగ ప్రవహించుశక్తిగల మూలపదార్థము తానున్న స్థలమునందే చుట్టిచుట్టి తిరుగుచుండును. ఈ చలన మొకవిధమైన సంకోచనాస్వభావమే (Contractility) యని చెప్ప