పుట:Jeevasastra Samgrahamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేవు. నిషేధములు: అజీవులగుస్ఫటికాదులు (Crystals) నీటిలోని పదార్థముల గొన్నిటిని తమచుట్టు నాకర్షించి యొకపొరపైనొకపొరగా జేర్చుకొని పెరుగుచుండును. భూగర్భమునుండి పొంగుకొని వచ్చు క్రొత్తపదార్థముల నిముడ్చుకొని పర్వతములు పెరుగును. కాని యివి జీవులు కావు.

3. జీవులు సజాతీయములగు జీవులనుండియే పుట్టును. అజీవ పదార్థములనుండి జీవులు పుట్టవు. ఒక జాతిజీవికి మరియొకజాతి జీవియు పుట్టదు. జీవోత్పత్తిక్రమమునుగూర్చి ప్రత్యేకముగా క్రింద వ్రాయుచున్నాము.

4. సామాన్యముగా సమస్తజీవులకును సంతానవృద్ధి (Reproduction) జెందు శక్తి గలదు. నిషేధములు: అంగసంపూర్ణత లేని నపుంసకులు, కంచరగాడిదలవంటి సంకరజంతువులు మొదలగునవి. వీనికి సంతానవృద్ధి జెందుశక్తి లేకపోయినను ఇవి జీవులే.

5. జీవుల కెప్పటికైనను మరణము (Death) సిద్ధము. నిషేధము: వికారిణి మొదలగు ఏకకణప్రాణులకు నై సర్గికముగా మరణము లేదు.

6. జీవులకు కరచరణాద్యవయవములు (Organs) గలవు. చెట్లయాకులు వేళ్ళు మొదలగునవి వాని యవయవములు. అజీవులు నిరవయవములు. నిషేధములు: జీవులలో కొన్నిటి కవయవములు లేవు; ఉదాహరణము-వికారిణి. అజీవులకు కొన్నిటి కవయవములు గలవు. పొగబండి; పొగయోడ; వీనికి చక్రములు మొదలైనవే యవయవములు.