7. జీవులకు చలనము (Locomotion) కలదు. అజీవులకు చలనము లేదు. నిషేధములు: హెచ్చుజాతి వృక్షములు, వానిగింజలు; ఇవి అచలములైనను జీవము గలవి. అజీవులయ్యును ద్రవపదార్థములో తేలుచుండు అణువులు ఒండొరుల్స్ యాకర్షణ (Gravitation) చే చలించుచుండును. కాని జీవులయొక్క చలనము వాని స్వశక్తిచే గలుగును. అజీవుల చలనము అన్యశక్తులచే గలుగును.
జీవోత్పత్తి క్రమము (Biogenesis)
ఈవరకు చదివిన ప్రాణులనుగూర్చి, అందు ముఖ్యముగా సూక్ష్మజీవులనుగూర్చి, నేర్చిన చదువరులకు అట్టి యణుమాత్రములైన నలుసులకు ప్రాణ మెట్లు కలిగినదో యను సంశయము గలుగవచ్చును. దానినిగూర్చి కొంత చర్చించుట యవసరము. హెచ్చుజాతిజీవులలో ప్రతిజీవియును మరియొక జీవినుండి పుట్టుచున్నదని మనకందరికి తెలిసినదియే. మన మొక కుక్కను జూపి యిది యెట్లు పుట్టినదని యొక పసిబిడ్డ నడుగగా దాని కొక తల్లి గలదనియు, దాని గర్భమునుండి యిది పుట్టినదనియు చెప్పును. ఒక చెట్టును జూపి యిది యెట్లుద్భవించినదని యడుగగా నిది యొక గింజనుండిగాని, అంటునుండిగాని పుట్టినదని చెప్పును. ఆ గింజయు అంటును ఎక్కడివని యడుగ, మరియొక తల్లి చెట్టునుండి పుట్టినవని చెప్పును. కాని కొన్ని చోట్ల నొకక్షణమునందు లెక్కింప నొక్కటియు లేక, మరియొక క్షణమున లక్షలకొలదిగ పుట్టునట్టి పురుగులు మొదలగు జీవకోట్లను