వీరు హార్మోనియమ్ వాద్యంలో అందెవేసిన చేయి. నా ఎరకలో ఇంత బాగా వాయించగలిగిన ఆడువారిని నేనెరుగను.
ఆకాశవాణిలో, జానపద సంగీతాన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్యకారకులు అనసూయ. జానపద సంగీతాన్ని కచేరీలలో కూడా పాడి దేశమంతట ప్రచారం చేశారు. సుభాష్ చంద్రబోస్, రాజేంద్రప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూ, లాల్‌బహుదూర్‌శాస్త్రి, డా|| రాధాకృష్ణన్, వి.వి.గిరి, శ్రీమతి ఇందిరాగాంధీ మొదలైన సుప్రసిద్ధుల ఎదుట గానం చేసి సెబాష్ అనిపించుకున్నారు.
వీరు అనేక రకమైన బాధ్యతలు స్వీకరించారు. ఆలిండియా రేడియోలో ప్రయోక్తగా, కళాశాలల్లో సంగీతాధ్యాపకురాలిగా, ఆడిషన్ బోర్డులో మెంబరుగా, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ మెంబరుగా, ఆంధ్ర యూనివర్సిటీలో బోర్డు ఆఫ్ స్టడీస్ మెంబరుగా, జానపద కళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా జానపద సంగీతానికి ఎనలేని సేవచేశారు. జానపపదాలు పాడుటలో ఈమెను మించినవారు లేరు. అంతేకాదు, ఈమె కొన్ని సినిమాలకు సంగీతం సమకూర్చారు. సంసారం బాధ్యత వల్ల సినిమాను వృత్తిగా గ్రహింపనప్పటికీ, ప్రతిభలో నేటి సంగీత దర్శకులెవరికీ ఈమె తీసి పోదని నా నమ్మకం. వీరి సంగీత దర్శకత్వంలో నేను చాలా పాటలు సినిమాలో పాడియున్నాను.
నాల్గు దశాబ్దులుగా కళకోసం జీవితాన్ని ధారపోసి, ముఖ్యంగా జానపద సంగీతాభివృద్ధికి మాత్రమే కాక, జానపద సంగీతోద్ధరణకు కారకురాలిగా నిర్విరామంగా కృషిచేస్తూ నేటికి వారి అనుభవాన్ని ఒక గ్రంధరూపంగా వెలువరించడం ఒక గొప్ప విశేషం. సంపూర్ణ రాగాల్లో ఉండే జానపద గేయాలు అరుదు. చాలా వరకు రాగచ్ఛాయల్లో ఉండేవే అధికంగా ఉంటాయి. అందుకనే, ప్రతీ పాటకు ముందు, ఆ పాట ఫలానా రాగపు స్వరాల్లో, ఫలానా తాళంలో ఉందని, అనసూయాదేవి రాగ, తాళ, విభజనచేసి, ఆ పాటకు