పుట:JanapadaGayyaalu.djvu/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాలు. అనసూయ అదృష్టం, ఆమె భర్త గిరిగారు, వారి ఆదరణ, ప్రోత్సాహం, అనసూయకు గర్వకారణం. అంతేకాక, తన కుమార్తె రత్నపాప శ్రీమతి రత్న అనిల్‌కుమార్ కూచిపూడి, భరతనాట్యాలలో, ప్రపంచ ఖ్యాతి గాంచిన నాట్యతార. అనసూయ పిల్లలందరూ కళాకారులే. పంచరత్నాలు. వీటన్నింటికంటె తన సోదరి సీత-వీళ్ళ అన్యోన్యం, అవినాభావత్వం, ఆశ్చర్యంగా ఉంటుంది. ఎల్లప్పుడూ ఒక్కలా దుస్తులు ధరించే వీరిరువురిలో, ఎవరు అనసూయ, ఎవరు సీతో, చాలామందికి, చాలాకాలం వరకూ, తెలియదు. అటువంటి సోదరి సీత దొరకడం నిజంగా అనసూయ అదృష్టం అనాలి. అయితే, తను సంగీతం సమకూర్చిన లలితగీతాలన్నీ చెల్లెలికి నేర్పించి, తనతో కూడ పాడించి, సీత జానపద "రిసెర్చి"కి తోడ్పడి తనంతటి దానిగా తయారుచేసిన అనసూయలాంటి సహృదయురాలైన అక్క దొరకడం సీత అదృష్టం కూడాను మరి.

డాక్టరు అనసూయాదేవి, జానపద సంగీతం, లలిత సంగీతాలకి చేసిన సేవ సువిదతం. జానపద సంగీతం అనాది, శాస్త్రీయ సంగీతానికి పునాది. నిష్కల్మషమైన హృదయంలోంచి, తానుగా ఉద్భవించింది జానపద సంగీతం. దీనిని క్షుణ్ణంగా తెలుసుకుని పాడలేని వారు సంగీత విద్వాంసులు కాలేరు. జానపదగేయాలు పాడడానికి ఉండవలసిన కొన్ని లక్షణాలు అంటే సాహిత్య జ్ఞానం, యాస, సంగీతజ్ఞానం, - ఇవన్నీ సరైన పద్ధతిలో గుర్తించి పాడినప్పుడు, విన్నప్పుడు, మన హృదయాలు స్పందిస్తాయి. ఈ విషయాలు చక్కగా గుర్తించి అనసూయ ఎంతో రిసెర్చి చేశారు. ఈమె బి.ఎ. డిగ్రీ తీసుకుని, కర్ణాటక సంగీతంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఈమె గురువు సంగీత సామ్రాట్ ముగుగంటి వెంకట్రావు పంతులుగారు. అనసూయ లలితగేయాలెన్నో సంగీతం కుర్చి పాడి లలిత సంగీతాన్ని ప్రచారంలోకి తెచ్చిన ప్రధమురాలు. సుప్రసిద్ధులైన ఎందరో కవుల గేయాలకి సంగీతం సమకూర్చి ప్రజలకందించారు. మేనమామ అయిన కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం మొదలైన రచనలన్నీ శ్రీమతి అనసూయ శుక్లపక్షంలోకి తెచ్చారు.