పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన భార్య జెన్నీ ఈ దినం. ఈ పరమ పవిత్ర దినంలో తన్ను పూర్ణంగా భర్తకు అర్పించుకొంటుంది. అందుకు తాను తగునా అన్న భయం అతణ్ణి ఈ రెండు మూడు రోజులూ గడబిడ పెట్టింది.

శుభముహూర్తం దరికి వచ్చినకొలదీ అతనికి గుండెలు దడదడ కొట్టు కొంటున్నాయి.

జెన్నీ నిజమా కాదా? ఆమె తన భార్యయేనా? ఆమె ఇప్పుడు తన దగ్గరగా చేయీ చేయీ, పార్శ్వమూ పార్వమూ కలిపి నడుస్తూ ఉన్నదా? అతడు త్రపాపూర్ణుడై, భయకంపిత గాత్రుడై ఆమెతో తన సహచర్య ఊహించుకొంటున్నాడు.

జెన్ని ఒకచోట మూర్తిని ఆపింది. ఒక రాయి చూపించి దానిపైన కూర్చుండమన్నది. తానతని ప్రక్కనే కూర్చున్నది.

“మూర్తీ!”

"జెన్నీ!"

“నేను నిన్ను వివాహం చేసుకున్నానంటే, మనం ఇద్దరం సర్వసములమై కలసిపోతున్నాము అనే భావంతోనే! అంతేకాని నేను నిన్ను వివాహం చేసుకోవడంవల్ల కొంత దిగిపోయాను అనిగాని, నాకు పాశ్చాత్య స్త్రీలకున్న తెల్లతనం ఉండడంవల్ల నేను నీకన్న కొంత గొప్పదానిని అని గాని ఏ మాత్రమూ లేదు. ఈ విషయం నువ్వు దృఢంగా నమ్ము !”

“అదేమిటి జెన్నీ?”

“ఉండు ప్రియతమా! కనక నువ్వూ నేను రెండు రేకులుగల పుష్పంలోని రెండు రేకలం. యమునా, గంగా సంగమం ఎంత నిత్యమో మన కలయిక అంతే నిత్యం. నేను నీకై, నీవు నాకై!” అని ఆ బాలిక అతని తలను వంచి ముద్దాడింది.

వారిద్దరూ రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వేంచేసినారు. ఇద్దరూ స్నానంచేసి మనోహర వస్త్రాలు ధరించినారు.

బట్లరు ఆ దినం వండిన వంట దేవతలు రుచిచూచి ఆనందించతగినది.

భోజనమైన వెనుక రేడియో పాటకు నాట్యం చేశారు. ఆమె బొంబాయిలో కొని తెచ్చుకున్న చిన్న పియానోమీద “లా-ఎ-పాష నెషా” (ఉద్రిక్త ప్రేమ) మహా గీతాన్ని వాయించింది. అతడు తాను అమెరికాలో కొందరు నీగ్రో సంగీత పాఠక స్నేహితుల దగ్గిర నేర్చుకొన్న చొపిన్ గీతాలు కొన్ని పాడినాడు.

రాత్రి పన్నెండు గంటలు మ్రోగినవి.

అతని హృదయము దడదడ మ్రోగుచున్నది.

ఆమె మోమంతా గులాబి పూవులో కందిపోవ, భర్త వంక చూచి “ప్రియతమా! నేను ముందు వెడుతున్నాను. సరీగా ముప్పాతిక గంట అయిన వెనుక -" అని లోనికి ఆనందహాస - ప్రపుల్ల వదనంతో వెడలిపోయింది.

ఇక ఆ ముప్పాతికగంట అతనికి నిముషమొక యుగం చొప్పున కల్పాలై జరిగినది. అతను పియానో వాయించుకుంటూ కూచున్నాడు. కొంతసేపు రేడియో తిప్పినాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

76

నరుడు(సాంఘిక నవల)