పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూపు దొంగలగుంపుకు దారిచూపుడు గాడుకా వెంటనే పెదవిదొంగలు ఆ భుజద్వయార్ద్రతా నంతా తస్కరింప ప్రయత్నించి ఎంతకూ తగదని ఆ ధనం కొల్లగొనలేకపోయినవి.

కొంచెం దిగువను ఎవరో ఇరువురు తొంగిచూస్తూన్నారు. వేళ్ళు ఆ యిరువురిపై ముసుగులూ, బొత్తాములు దీసి సడలించినవి.

అప్పుడాతని దృష్టికి దంతాన్ని నలుపుచేసే ధవళకాంతులు కలవి, స్వచ్ఛహిమాచలశృంగాలపై పడిన ఉదయారుణకాంతులను కర్కశం చేసే పాటలవర్ణ దివ్యకాంతులు కలవి, గుండ్రని శిఖరాలు కలవి, లోకాద్భుత సౌందర్య విజృంభణము కలవి, సర్వమనోహరాలతో స్నాతులైనవి, ఉచ్చేస్రవం ముట్టె, కామధేనువు చిరుమూపురం, పారిజాతాల పరీమళం, లక్ష్మీదేవి నుదురు ప్రాభృతాలు పొందినవి.కోటివేల చిత్రవిచిత్ర పవిత్ర కాంక్షలు దాచుకొన్నవి. వక్షోజోన్నతాల సందర్శనం అయింది. గౌరీశంకర కాంచన గంగా శిఖర సందర్శనం చేసిన కళాకారుని మహదానందమూ, కైలాసశిఖర ప్రత్యక్షము వరమందిన భక్తుని దివ్యానందము! గంగా యమునలు సంగమమై అతని చూపులు ప్రవహించినవి. అతని హృదయ మాసంగమంలో సరస్వతిలా లయమై పోయినది.

పవిత్రచుంబనా లా చూచుక దివ్యత్వాల కర్పించి మూర్తి తెరలు కప్పివేసినాడు.

వారిరువురకు మాటలు లేవు. ఇరువురు సహ్యమలయ మధ్యస్థ లోనవాలాలో తమ నివాసగృహం చేరిన కాని ఆత్మమనస్సులతోబాటు, దేహాలలీనం కావింపదలచు కోలేదు. రైలు సాగిపోయింది.

3

లోనవాలా ఇంటికి ఢిల్లీ నుండి సామానంతా వచ్చినది. అవీగాక, బొంబాయిలో కొత్తసామాను కొన్నది జెన్నీ. ఆ గృహాన్ని ఆ ఎత్తయిన లోయ అందానికి శ్రుతిగా అలంకరించింది.

సాయంకాలం అయింది. జెన్నీ, మూర్తీ ఇద్దరూ కలసి ఆ లోయబాటలో వ్యాహ్యాళికి బయలుదేరారు. రెండువేల అడుగులకు మించి, మూడువేలు, నాలుగువేల అడుగుల వరకు పైకెగిసిన సహ్యామలయ పర్వతలోయలు, అడవులు, జలపతనాలు, పరమాద్భుత ప్రకృతి సౌందర్యవర్తిత మనోహరమై ఆ ప్రదేశం వారి హృదయాలను కరగించివేసింది.

ఆ దినం వారు నిర్ణయించుకొన్న పవిత్ర సంధాన దినం. ఆ ఇద్దరే ఆ ప్రకృతోత్సాహం మధ్య! పక్షులు గూళ్ళకు చేరుతున్నాయి. కిలకిల, గలగల, కూకూ, కువకువ స్వరాలు ఆ కొండ చరియలకు తాకి ఆ లోయలో ప్రతిధ్వనిస్తున్నవి. సూర్యబింబమూ కొండల చాటుకు దిగజారిపోయింది. ఆకాశంలో ఎరుపు, వంగపండు, కుంకుమ అరుణలు కాంతులు ఒరుసుకుపోతున్నవి.

ఇద్దరిలో మాటలు లేవు. ఇద్దరూ సిగ్గుపడుతున్నారు. అతడు నీలసుందరీనగ్నత పొరపాటున ఏ కాలవ రేవులోనో తన గూడెంలో స్నానాల సమయంలోనో చూచి ఉన్నాడు.

పాశ్చాత్య దేశాలలో ధవళసుందరుల నగ్నత దర్శించడానికి కోటివేల అవకాశాలున్నా ఎల్లమందమూర్తి హృదయంలో ఆ కోర్కె చాలాసారులు ఉద్భవించినా, ఆ భావానికే అతడు లజ్జపడి ఊరుకొన్నాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

75

నరుడు(సాంఘిక నవల)