పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొంతసేపు “మేరీస్టోప్సు” “భార్యాభర్తల ప్రథమ దినము” అనే గ్రంథము తీసినాడు. కొంతసేపు పైకి వెళ్ళి దూరపుటిళ్ళ వెలుగులు, ఆకాశంలో తారకల వెలుగులు ఆ దశమినాటి వెన్నెల రాయని ఆనందము గమనించాడు.

ఇంటిలోనికిపోయి గడియారం వంక చూస్తే ఇంకా పావుగంట వున్నది. రేడియో తగ్గించి వున్నందున నెమ్మదిగా “హవాయిస్” గీతాలు విచిత్ర మేళనపు హంగుతో పాడుతున్నది.

మూర్తి బొంబాయిలో ఒక ఛాయా చిత్రశాలలో తయారు చేయించిన జెన్నీ పెద్ద చిత్రానికి ఎదురుగా నిలుచుండి ఆమె సౌందర్యము, ఆమె విలాసము ఆమె మందహాసము, ఆమె చూపులలోని మంత్ర ముగ్ధత్వమూ తనివితీర గ్రోలుతూ సర్వము మరచి వున్నాడు.

బాల్యదశలో రాబోవు ప్రేమ, ప్రథమయవ్వనంలో ప్రేమకై ఎదురుచూపు, యౌవనమధ్యాన పొదివికొన్న ప్రేమ, యౌవనంలో ప్రేమమయత, కౌమార ప్రారంభములో ప్రేమఫలము, వృద్ధాప్యంలో ప్రేమస్మృతి, “ఓహో ప్రేమమయ మీ జగమూ!” అనే సినిమాపాట జ్ఞాపకం వచ్చింది మూర్తికి. తన ప్రేమలోని విచిత్రత, సర్వలోక ప్రేమికులకూ ఏలా సంభవిస్తుంది.

“ప్రేమింపవే రాణి ప్రేమింపు నన్ను
ప్రేమ కల్లోలాల మింటికెగరేయవే!”

మానవ జన్మలో ప్రేమ శిఖరము. ఆ ఉత్తమ సంధానంవల్ల మానవ జన్మంతా తేజోవిలసితమై మానవ లోకానికి కళ్యాణప్రదమై, మహోత్తమమై, పవిత్రాదర్శపులకితమై పోతుంది. జెన్నీ! సకల సౌందర్యరాశి! ఆమె శిరస్సు ఏ శిల్పులకూ అందని మూర్తిమంతము. ఆమె జుట్టు చాకొలేటు రంగుతో పట్టుకుచ్చులై ఒత్తయి భుజంమీద పతనాలుగా ప్రవహిస్తుంది. ప్రాచ్యలోచనాల దీర్ఘ వినీలత మధుర మత్తతతో వక్రాంచల సమనాశికా గులాబీపుష్ప పత్రపుటాలతో, మధ్యపూర్ణ ధనుర్వక్ర మధుమయార్ద్రిత మందార కుట్మల సదృశా ధరోష్టాలతో వెలుగొందే ఆమె ముఖం! జెన్నీ! ప్రేమదేవతా!

సరిగా శుభముహూర్తము వచ్చినది.

అతని కాళ్ళు వణకినవి. చిరు చెమటలు పట్టినవి. అతడింతవరకు ఆ పడకగది అలంకరణ చూడలేదు. ఆమె అతనిని లోనికి రానీయలేదు.

మూర్తి స్లిప్పర్సు చప్పుడు చేయకుండా నడిచి తలుపు దగ్గరకు చేరినాడు.

గుండెల చప్పుడు దెసలు మారుమ్రోగుతూ ఉండగా నెమ్మదిగా తలుపు తీసినాడు. తలుపులు లోనికి కొంత పోయినవి.

దీపములన్నీ ఆర్పి వచ్చినాడు. కావున ఆ చీకటిలోనికి తలుపు సందునుండి నీలివెలుగు పైకి నీలపు తీగలా ప్రసరించినది.

అతడు తలుపు దగ్గర ఆగిపోయినాడు.

అతని గొంతుకలో దగ్గుత్తిక వచ్చినది.

పది లిప్తలు తలుపు దగ్గర ఆగి, లోనకు కుడి అడుగు వేసినాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

77

నరుడు(సాంఘిక నవల)