పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 ఆర్థికంగా తనవారు భూస్వాములు, ఉద్యోగులు, వర్తకులు అయిన మరునాడు ఈ దుర్భరస్థితి పోతుంది. ఉద్యోగం చేసే క్రిష్టియనులకు తన సంఘానికి వున్న దౌర్బాగ్యస్థితి ఏది? ముస్లిం మతం కాని, సిక్కు మతంకాని పుచ్చుకున్న హరిజనులకు ఈ దుర్భరస్థితి లేదు. ఒక మతంలో వున్న లోపాలను సవరించి, దాన్నే ఉత్తమ స్థితికి కొనిపోవడం మగతనమూ, పవిత్ర ధర్మమూ అవుతుంది అని అనుకున్నాడు.

మూర్తి తిరుగుతూ పై అధికారులకు తాను చూచినది, చేయవలసిన మార్పులు, వృద్ది చేయవలసిన విధానం అంచనాలు, లెక్కలు అద్భుత శాస్త్ర గ్రంథంలా తయారు చేసి పంపేవాడు. ఒకనాడు బ్రిటిషు దేశస్తుడయిన చీఫ్ ఇంజనీరు ఈతని నివేదికలన్నీ చదివాడు. అవి చదువుతూ చదువుతూ తక్కిన సర్వమూ మరిచిపోయి ఆ నివేదికలన్నీ పూర్తి చేశాడు. భాషమాట అట్లా ఉంచి విషయమూ, శక్తి చూచి ఆశ్చర్యమందినాడు. వెంటనే ఎల్లమందమూర్తిని గూర్చిన కాగితాలన్నీ తెప్పించుకు చూచినాడు. అతనికి ఎంతో సంతోషం వేసింది.

వెంటనే ఎల్లమందమూర్తికి బొంబాయి రాష్ట్ర ఉదక జనిత విద్యుచ్ఛక్తి సహాయ ఇంజనీరుగా, వేయి రూపాయల జీతం మీద ఉద్యోగం ఇచ్చి, వెంటనే వెళ్ళి చార్జి పుచ్చుకొమ్మని ఆజ్ఞ యిచ్చినాడు.

మూర్తి గరిసెప్ప జలపాతం దగ్గిర వున్నప్పుడా ఆజ్ఞాపత్రం అందినది. గరిసెప్ప జలపాతంవంటి మహాపాతాలు మూర్తి అమెరికాలో దర్శించినాడు. నయాగరా జలపాత మహాభావం అతడర్ధం చేసుకున్నాడు. నయాగరా భావం అమెరికా! గరిసెప్ప భారతదేశం. శివసముద్రంకన్న గరిసెప్ప ప్రతాపం అఖండమైనది. శివసముద్రపు బాలికా తాండవము, గరిసెప్ప పురుషుని తాండవము.

క్షణికంలో ప్రతికోటివంతు కాలమూ నీటిలోని ప్రతి అణువు క్రిందకు పడుతున్నది. అలాంటి అణువులు ఆ కాల భాగంలో ముందుకు వస్తున్నాయి.నిత్యమై జలం ప్రవహిస్తున్నది. నిత్యపతనము, నిత్యనూతనము. అలాగే ప్రేమ నిత్యనూతనము, ప్రేమికులు నిత్యనూతనము. ప్రేమ గరిసెప్ప మహాప్రతాపము, ప్రేమమహాప్రవాహము ప్రేమ సూక్ష్మమూ, స్థూలమూ! ప్రేమ కదలని స్థిరత్వము; అఖండ వేగంతో కదిలిపోయే మహాభయంకర తృణావర్తము. ప్రేమ ప్రేమకోసం, ప్రేమ జాతివృద్దికోసం.ప్రేమ సూర్యాగ్ని గోళం. ప్రేమ చంద్రశీతలం.


ఆ ఆలోచన కడ చటుక్కున ఎల్లమందమూర్తి ఆగిపోయినాడు. ఏమిటిది? నీటిశక్తి లెక్కల చూచుకొనే తనకు ప్రేమశక్తి లెక్కల చూడడం సంభవించిందేమి? జెన్నీ తన ఆలోచనలలో అంతభాగం ఆక్రమించుకొని పోయిందేమి? జెన్నీ! ఎక్కడ వున్నావు?

★ ★ ★


అడివి బాపిరాజు రచనలు - 7

68

నరుడు(సాంఘిక నవల)