పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 బాలిక ఛాయాచిత్రాలను ఎన్నింటినో అతడు చిత్రచిత్రాలైన ఫ్రేములు కట్టించుకొని తన ఇల్లంతా అలంకరించుకొన్నాడు. ఆ చిత్రాలన్నిటినీ ఎన్నిసారులో పలకరించుకొన్నాడు.

పడక కుర్చీలో వాలి, ఏమిటి జెన్నీ అన్నగారి ఉద్దేశం? తానేమి చేయాలి? జెన్నీని తానెల్లా వదిలివేయగలడు? జెన్నీ ఏమంటుంది? ప్రపంచం అంతా తన పైనే కత్తిగట్టినారా? లయొనెల్‌కు రాస్తే అతడేమి అంటాడో!

“జెన్నీ! ప్రాణప్రియా! నిన్ను పొందలేని నాకు ఈ ఉద్యోగం వద్దు. మా జక్కరం గ్రామంపోయి అక్కడ ఏదో హరిజన సేవ చేసుకుంటూ ఉండవచ్చు. లేదా మహాత్ముని ఆశ్రమానికి పోయి, అక్కడ ఆ బాపూజీకి సేవచేస్తూ ఆయన ఆజ్ఞ ప్రకారం నడవవచ్చు.” అని జెన్నీ చిత్రం వైపు చూస్తూ మాటలాడినాడు.

9

యుద్దం చల్లగా వచ్చింది. వచ్చినప్పుడు అంత ప్రళయం అవుతుందని ఎవరనుకున్నారు. జర్మనీ రష్యాతో సంధి చేసుకొని పోలండు మీదికి దిగింది. పోలండు జర్మనీ కత్తిపీటకు ఆనపకాయ అయింది. జర్మనీ పోలండు మీదికి వెళ్ళింది గనుక ఇంగ్లండు, ఫ్రాన్సులు జర్మనీమీద యుద్ధం ప్రకటించాయి. హిట్లరు అబ్బే అంటూనే ఆస్ట్రియా ఆక్రమించుకొన్నాడు. చెకొస్లావేకియా ఆక్రమించుకొన్నాడు. గొడుగు ధరించి ఛాంబర్లేనుగారు ఎంత తన రాజకీయపు టెత్తులు వేస్తే ఏమి? హిట్లరుకు భయమా!

ఇంగ్లండుకు ఏమంత బలం ఉంది? చీనా జపాను యుద్ధంలో ఏమీ చేయలేక పోయింది. ఒక మాటు చీనా పక్షం అంది, ఇంకోమాటు ఏ పక్షమూ కాదంది. బర్మా రోడ్డు తెరిచింది. చీనా సహాయంకోసం; తర్వాత జపానుకు కోపం వస్తే ఆ రోడ్డు మూసి వేసింది. అబ్సీనియాపై ఇటలీ విరుచుకుపడితే, ఆహాహా! అంది. ఇటలీ తన నావికాబలం, అదీ చూపించేసరికి తర్వాత చెప్తాలే అన్నట్టు ఊరుకుంది.

హిట్లరు ఇంగ్లండుకు ఎంత బలం ఉందో అప్పుడే తెలిసికొన్నాడు. ఫ్రాన్సు ఎప్పటికైనా తన చేతిలోనిదే. ఫ్రాన్సుకూ జర్మనీకి మధ్య ఫ్రాన్సువారి “మాజినో' దుర్గ శ్రేణి ఉన్నది. జర్మనీకి “సీగ్ ఫ్రీడ్” శ్రేణి వుంది. ఆ శ్రేణుల మధ్య మొదట వేళాకోళం యుద్దం సాగింది. పోలండు అయిపోయింది. అప్పుడు పడమటకు తిరిగాడు హిట్లరు.

ఎల్లమందమూర్తి ఉద్యోగ ధర్మాన పంజాబ్, సింధు, బొంబాయి, మద్రాసు రాష్ట్రాలు తిరుగుతూ, ఆయా రాష్ట్రాలలో ఇదివరకే స్థాపింపబడి వున్న ఉదక వేగజనిత విద్యుత్ సంస్థలను పరిశీలిస్తున్నాడు. ఎన్నో ఉత్తరాలు రాసినాడు జెన్నీకి, జెన్నీనుంచి ఒక్క వుత్తరమూ లేదు. ఏమిటీ రహస్యం. జెన్నీ అన్నగారు, ఆ మేజరు ఏదో చేసినాడు.

ఎక్కడకు వెళ్ళినా అతడు ఆ చుట్టుప్రక్కల హరిజన వాడలు పరిశీలించేవాడు. అతని గుండె తరుక్కుపోయేది. ఏమి చేయగలడు? ఒక పర్వతం నెట్టివేయడం వంటిదది. ఏనాటికి తన సంఘానికి విముక్తి? కాంగ్రెసు వారూ వెనకటి సంప్రదాయం వదలలేకుండా వున్నారు. అయినా ఏం చేయగలిగినా వారే! ఒక్కటే మార్గం ఉంది. హరిజన బాలికలు చక్కని విద్య నేర్చుకుని ఉత్తమ కులాల బాలకుల్ని వివాహం చేసుకోవాలి. చదువు, అలంకారం, శుభ్రత, నాగరకత, ఇవి మనుష్యులను పైకి తీసుకువెడతాయి.


అడివి బాపిరాజు రచనలు - 7

67

నరుడు(సాంఘిక నవల)