పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ఐదవ భాగం

విషాదయోగం

జెన్నీ ఏమయిపోయిందో లోనవాలాలో మకాం పెట్టి మూర్తి ఆలోచించుకుంటూ కూచున్నాడు. లయొనెల్ దగ్గిరనుండి ఇంతట్లో ఒక ఉత్తరం చక్కా వచ్చింది. మూర్తి బొంబాయి వచ్చి చార్జిపుచ్చుకుని మూడురోజులయింది. లోనవాలా వచ్చి రోజయింది. ఇవాళ లయొనెల్ దగ్గిరనుండి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం బొంబాయి మెట్టూరు, లోనవాలా, మైసూరు, శివసముద్రం, గరిసెప్ప, బొంబాయి వచ్చి అచటనుంచి మళ్ళీ లోనవాలా వచ్చింది.

మూర్తి ఢిల్లీలో ఉండే రోజుల్లో లయొనెల్‌కు ఎన్నో ఉత్తరాలు రాసేవాడు. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలయిలలో లయొనెల్ దగ్గిరనుండి ఉత్తరాలు వస్తూనే వున్నాయి. లయొనెల్ ఒకడే మూర్తికి సర్వవిధాలా మద్దతు చేస్తూ ఉండేవాడు.

జెన్నీ ఆ నాలుగున్నర నెలలూ మూర్తికి అరవై రెండు ఉత్తరాలు తన హృదయమే కావ్యమయినట్లు రాసేది. ఆగస్టు నెలాఖరులో జెన్నీ పట్టలేక ఢిల్లీ ప్రయాణమై వచ్చింది. వచ్చిన పదిరోజులలో మాయమైపోయింది.

తన ప్రేమచరిత్ర లెక్క చూచుకొంటూ జెన్నీ చిత్రం చేతిలో ధరించి లోనవాలా లోయలో తను మకాం చేసిన బంగాళాలో అధివసించిన మూర్తి తాను జెన్నీని కలుసుకున్నప్పటినుంచి తన ప్రేమ పొందిన పరిణామమూ, అది ప్రవహించిన వేగమూ, పతనాలూ, సుడులూ అన్నీ ఆలోచిస్తూ ఆమె చిత్రాన్ని రెండుసార్లు పవిత్ర ప్రేమతో కళ్ళకద్దుకున్నాడు.

ఏ మహాప్రేమ చరిత్రయినా రోజులలో మార్పులు, నెలలో మార్పులు అనేకం పొందుతూ ఉంటుంది. ఈ నాలుగున్నరనెలలలో తన ప్రేమ చరిత్ర అతి చిత్రమై, బాధాకరమై పరిణమించింది.

ఈనాడు లయొనెల్ ఉత్తరం చూస్తూనే ఎల్లమంద ప్రాణం జల్లార్చుకుపోయింది.

పెషావరు

కంటోన్మెంటు

12 సెప్టెంబరు, 1939

.

ప్రియమైన మూర్తీ!

నీ ఉత్తరం అందింది. మా అన్నగారు వట్టి జంతువులా తయారయ్యాడు. జెన్నీని మాయచేసి పెషావరునుండి ఎత్తుకుపోయాడు. నీ ఉత్తరం చూచి నేను మా వదినకు నిజంగా జబ్బుచేసి ఉంటే సహాయార్ధం జెన్నీని తీసుకు వెళ్ళడానికి వచ్చి నిన్ను కలుసుకొని తన అక్కసు అంతా తీర్చుకొని, జెన్నీని తీసుకువెళ్ళాడనుకొన్నాను. వెంటనే వదినకు ఎలా ఉందని మా అన్నకు తంతి కొట్టాను. కులాసాగానే వుందని నాకు జవాబు ఇచ్చాడు. ఆ సంగతే నీకు ఉత్తరం రాశాను.

అడివి బాపిరాజు రచనలు - 7

69

నరుడు(సాంఘిక నవల)