పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారతదేశంలో సాధారణాంగ్లేయుల వర్తన విచిత్రం. ఇంగ్లండులో మాతో సమంగా చదువుకొన్న ఆంగ్ల యువకుడు ఏ ఉద్యోగిగానో మనదేశం రాగానే తనతోటి విద్యార్థి స్నేహితుని ఇక్కడ అవమానిస్తాడు. అతని ముక్కు పై కెగసిపోతుంది. ఫారెస్టర్ రాసిన “ఇండియాకు ఒక యాత్ర” అనే గ్రంథం చదవలేదా ప్రియతమా! ఆ భారతీయుడు తోడి ఉద్యోగిగా వచ్చినా ఆ ఆంగ్లేయుడు లెక్క చేయడు.

“నేను ఇంగ్లండులో చదువుకొంటున్నప్పుడు నన్ను మా కాలేజీవారు కాలిబంతి ఆట జట్టులోనికి తీసుకోవాలని ప్రయత్నించారు. ఎవరో కొందరు తప్ప తక్కినవారు. “భారతీయ నిగ్గర్ మాతో సమంగా జట్టులో ఉండడమేమిటి?” అన్నారు.

“కాని నేను ఆటలోనికి వెళ్ళక తప్పింది కాదు. కాలేజీ జట్టు మూడేళ్ళనుంచీ నెగ్గటంలేనిది, ఆ ఏడు మొదటి స్థానం ఆక్రమించి నెగ్గింది. ప్రతి విజయంలోనూ నేను ఎక్కువ గోలు చేయడం జరుగుతూ ఉండేది. ఆఖరి ముఖ్య పందెంలో చేసిన గోలు అన్నీ నేనే! అందుచేత మా కాలేజీ వాళ్ళు చేసిన ఉత్సవంలో నేను ప్రధాన నాయకుణ్ణి అయ్యాను. ఆ కాస్త పదవికీ చాలా కష్టపడిన వారున్నారు. ప్రాణేశ్వరీ, “ఈ నిగ్గర్ మనవాళ్ళందరికన్నా బాగా ఆడడమేమిటి?” అని ఒక యువకుడు అతని స్నేహితునితో అంటూ వుంటే ఆ ముక్కలు నా చెవిని పడినాయి.

“తెల్లవారు మన దేశంలో రాజ్యం చేస్తున్నారు. వాళ్ళది ఇండియా! ఈ భావం ఎలిజబెత్తులో ఉందని నేను కాస్త అనుకోవటానికి ఆమె మాటలే కారణం.

“ప్రాణప్రియా! నా ఆత్మ మధ్యస్థా! ఒక్కమాట మాత్రం బాగా నమ్ము. నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను. నా జీవిత నౌకకు నువ్వే కెప్తానువు.

నీ దాసానుదాసుడు

అతి ప్రేమభక్తుడు

నీ పెదవి అమృతం ఆశించే

“మూర్తి”


15గ, గ్రాంటు హోటలు,

న్యూఢిల్లీ,

8 మార్చి, 1939.

ప్రియాతి ప్రియబాలికా,

నీ హృదయమే మూర్తి గట్టిన లేఖ అందింది. మీ తండ్రికీ, తల్లికీ ఇష్టం లేదన్న వార్త నా గుండెల్లో పిడుగులు కురిపించింది. అయితే మన కర్తవ్యం! మురుగుకాల్వలో పొర్లే జాతికి చెందిన ఒక దురదృష్టవంతుణ్ణి నువ్వు చేయిపట్టి ఈవలకు లాగినావు. ఏదో ఒక పరమాద్భుతమయిన దర్శనంలా నువ్వు నా ఎదుటకు వచ్చావు. పవిత్రమైన ఆశ్చర్యం కల్పించావు.

నేను ప్రేమ అంటే ఏమిటో, వివాహం అంటే ఏమిటో ఏనాడూ ఆలోచించని ప్రాథమిక మనస్తత్వంగల మనుష్యుణ్ణి.

అడివి బాపిరాజు రచనలు - 7

55

నరుడు(సాంఘిక నవల)