పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



4

ఎల్లమందమూర్తి ప్రతిదినమూ ఉత్తరాలు రాయడమే. “నా హృదయం మధ్య సింహాసనం అధివసించి ఉన్న ప్రియా! మధుర మధురమయిన ఆలోచనలన్నీ వ్యక్తం చేయలేము. ఉత్తరంలో కాగితమూ కలమూ, ఆలోచనలూ మనమూ!

“కలం పాటలు పాడుతుంది; నాట్యం చేస్తుంది. వీణ, వాయులీనం, మాండోలీనం, పియాను, పిల్లంగ్రోవి గుండెలు కరిగేటట్లు మోయించకలదు. కలం నాట్యం చేస్తుంది. కలం దూరంగా ఉన్న వ్యక్తుల్ని దగ్గరగా తీసుకువస్తుంది.

“నాకు ఎదుట మాటలు లేవు! కాని నీ ఉత్తరాలు నిన్నే సర్వకాలం నా ఒడిలో కూర్చుండబెడుతున్నాయి.

“ఓయి ప్రియతమేశ్వరీ! నేను దారి తెలియని పసిబాలకునిలా ఉన్నాను. హడలి ప్రపంచాన్ని తెల్లబోయి చూస్తున్నాను. అంతా కొత్తగా కనబడి కంటనీరుతో కరిగి పోతున్నాను. అలాంటి నాకు తోటిపిల్లవూ, స్నేహితురాలవై నాకు ధైర్యం చెప్పే గురువువై నీవు కన్పించావు.

“ప్రపంచంలో పురుషుడు ముందుకు పోవాలంటే పురుషునికి స్త్రీయే సారధి. అలాగే స్త్రీకి పురుషుడనుకొంటాను. ఇది నిర్ధారణగా నాకు తెలియదుగాని, మొదటి విషయం నాకు తెలుసును. ప్రాణేశ్వరీ! నేను కౌగలించుకోడానికంటే సిగ్గుపడతాను. నేను చీకటిని, నువ్వు వెన్నెల వెలుగువు.

“కవులు - వెన్నెల చీకటిని తరిమివేస్తుందని వర్ణిస్తారు. నా ఉద్దేశంలో వెన్నెల అత్యంతమయిన దయతో చీకటిని తనతో లయింప చేసుకుంటుందని.

"నీ ప్రేమకు పాత్రుణ్ణా కానా? అనే పవిత్ర విషయం నాకింకా నిర్ణయంగా తేలలేదు. పాత్రా పాత్రదానం అంటో లేదా ప్రియా!”

“నీ వంటి దివ్యాంగన ప్రేమ ఎదుట ఉండే కల్మషాన్ని దహించి పవిత్రం చేసే శక్తిగలది.

ఇట్లు నీ పెదవులు భక్తితో

వరం క్రింద ఆస్వాదించే

నీ దాసుడు

“మూర్తి”

“ప్రియతమేశ్వరి!

మీ తండ్రికీ, తల్లికీ ఎలిజబెత్తుకూ, చుట్టాలకూ, మన ప్రేమ ఏమి అర్థం అవుతుంది. ఎలిజబెత్తు విషయంలో మాత్రం కొంత నాకు ఆశ్చర్యమే కలుగుతూ ఉన్నది. ఆమె శుద్దమయిన ఆంగ్ల బాలిక! కాబట్టి లయొనెల్‌ను వివాహం చేసుకోకూడదని తల్లీ, తండ్రీ చుట్టాలూ మూర్ఖపు పట్టుపడితే, నేను వారందరితో ఎంతో కాలం వాదించి ఒప్పించాను. ఎలిజబెత్తు నాకు అర్పించిన నమస్కారాలూ నా జన్మ అంతకూ సరిపోతాయి. అలాంటి ఎలిజబెత్తు ఈలా తయారయిందంటే ఏదో కారణం ఉందనే నాకు తోస్తున్నది.

అడివి బాపిరాజు రచనలు - 7

54

నరుడు(సాంఘిక నవల)