పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మా సంఘం నిజస్వరూపం నీకు పూర్తిగా తెలియదు. తప్పి జారి ఒక్క గులకరాయి మహారాణి రత్నాల హారాని కెక్కినట్లు నేను మా సంఘంలోంచి తప్పి జారీ బయటపడిన మనుష్యుణ్ణి.

మా సంఘం సరియైన గుడ్డకట్టడం ఎరుగదు. సరియైన తిండి ఎరుగదు, లోకం అంటే ఏమిటో ఎరుగదు. ఒక్క విజ్ఞాన విషయమూ ఎరుగదు. మా ఊరి చుట్టుపక్కల వున్న ఊళ్ళ విషయం తప్ప మా వాళ్ళేమీ ఎరుగరు. వాళ్ళ రాజకీయాలు పెద్ద ఆసామీల దెబ్బలాటలు. వాళ్ళ కావ్యానందం అసభ్యపు పాటలు పాడుకోవడం. కొన్ని చాలా చక్కనివీ, రసవంతమయినవీ ఉంటాయి. వాళ్ళ సినీమా తోలుబొమ్మలాట. వాళ్ళ పండగ భోజనం చచ్చిన గొడ్డు మాంసం, వాళ్ళ బిడ్డల ఆటలు పేడపోగు చేయడం, దుమ్ములో పొర్లడం. వాళ్ళ చదువు నోటిలో వేళ్ళు పెట్టుకోవడం. వాళ్ళ ఉద్యోగం దేహం వంచి పొలంపని, అందుకు జీతం చిట్టెడు గింజలు.

మా అత్తరు వాసనలు కుళ్ళుకంపు. మా రంగు నల్ల కారుదున్న. మా తలలు నూనెలెరుగవు, మా ఒళ్ళు సబ్బు లెరుగవు. మా గుడ్డలు తెలుపు, ప్రకాశమూ ఎరుగవు. మా కామాలు తిన్నగా స్త్రీ పురుషులు కలియడమే!

మా హంసతూలికా తల్పాలు నులకమంచం, పొలం గట్టు, ఇంటి ముందు స్థలం. మా మోటారు యజమాని వ్యవసాయం బళ్ళు. మా చుట్టాలు నక్కలు, ఊరకుక్కలు, రాంబందులు, పందులు.

మా దేవుళ్ళు పీనుగుల అమ్మవార్లు, మా గుళ్ళు హడలగొట్టే పోతరాజు గుడిసె. మేం అత్తరువులు, అగరువత్తులు, సబ్బులు, తల నూనెలు, దువ్వెనలు ఎరుగము. చీనాతో, అల్యూమినంతో, ఇత్తడితో, కంచుతో, రాగితో చేసిన వస్తువులు ఎరుగం.

మా కంచాలు మట్టిచిప్పలు, మా వంటసామాను కుండలు, మూకుళ్ళు, దాకలు, కర్రతెడ్లు.

ప్రాణకాంతా! అలాంటి పెంటకుప్పల్లో నేను ఉద్భవించాను, పెరిగాను, నీ ఎదుట నిలిచాను.

నన్నంటి నా చరిత్ర క్రీనీడలా కూడా వస్తుంది కాబోలు నా పేరు వినేసరికే మీ తల్లితండ్రులకు భయం వేసింది.

ఏమిటి మన కర్తవ్యం? ఈ విషయం ఇంతటిది?

ఇక కేంద్ర ప్రభుత్వం వారు నాకు తాత్కాలికంగా ప్రవాహ జనిత విద్యుచ్ఛక్తి సంస్థలనూ, ఆనకట్టలను పరీక్ష చేసే ఉద్యోగిగా అయిదువందల రూపాయల జీతంమీద ఏర్పాటు చేశారు. ఖర్చులు వేరేనట. మొదటి తరగతి రెండు టిక్కట్లూ, బేటా రోజుకు పది హేను రూపాయలు. కారుకు వేరే భత్యం ఇస్తారట. నా ఉద్యోగం ఏడాదివరకు తాత్కాలికమట. ఆ తర్వాత నేనిచ్చే నివేదిక, ప్రణాళికలనుబట్టి ఆ ఉద్యోగం ఉంచడమో, తీసివేయడమో చూస్తారట. నేను 15వ తారీఖున ఉద్యోగంలో చేరుతున్నాను.

నా ఆఫీసు న్యూఢిల్లీలోనే ప్రభుత్వంవారు ఏర్పాటు చేశారు. నేను కేంద్ర ప్రభుత్వ ముఖ్యఇంజనీరుగారికి లోబడి పనిచేయాలి. ఆయనే నాకో టైపిష్టునూ, ఒక గుమాస్తాను.

అడివి బాపిరాజు రచనలు - 7

56

నరుడు(సాంఘిక నవల)