పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఆ విషయం ఇప్పుడప్పుడే నిశ్చయం చేసుకోవద్దు విల్లీ!”

“అదేమిటి?” అతని ఆశ్చర్యానికి అంతులేదు. అతని మోము వైవర్ణ్య మొందింది.

“కంగారుపడకు విల్లీ!”

“నువ్వు నన్ను ప్రేమించటం లేదా?”

“ఇంకా నేనేమి నిశ్చయానికి రాలేదు?”

“అయితే-?”

“అయితే ఎల్లా ముద్దు పెట్టుకోనిచ్చావూ?” అని ప్రశ్న! అంతేనా? ఈ ఇరవైయవ శతాబ్దంలో ముద్దులకు స్నేహార్ద్రత తప్ప ఇంకో అర్థంలేదు. అందుకనేగా ఇంతవరకు నిన్ను నా పెదవులు ముట్టనివ్వలేదు: నువ్వు ప్రస్తుతం నాకు చాలా దగ్గిర స్నేహితుడవు. ఇంక కొంచెం అయితే నా పురుషుడవే అవుతావు!”

“ఇంతేనా నీ భావం. నాకు ఆశలేనట్లే! ఎందుకు నా బ్రతుకు! నేను నీకు ఆటవస్తువును అయ్యానా జెన్నిఫర్?”

తన్ను “జెన్నీ” అని పిలవకుండా “జెన్నిఫర్” అని పిలవడం ఆమెకు అతని హృదయవేదనా, అతనిలో ఉద్భవించిన కోపమూ అర్ధమైంది.

“నామీద కోపం వచ్చిందా విల్లీ?”

“నీమీద కోపం ఎందుకూ, నామీదే నాకు కోపం!”

అతడు అతి విచారంతో వెళ్ళిపోయాడు. ఆరునెలల వరకు అతడు మళ్ళీ జెన్నిఫర్‌ను కలుసుకోలేకపోయాడు. 1935వ సంవత్సరం జూన్ నెలలో ప్రత్యేకం ఒక నెలరోజుల పాటు సెలవు పుచ్చుకుని విల్లీ మదరాసు వచ్చాడు. ఆ నెల రోజులూ అతను జెన్నీ మనస్సు కరిగించేసిన ప్రయత్నం ఇంతా అంతా కాదు. కాని జెన్నీ తనచుట్టూ నిర్మించుకొన్న కోట మొదటి గుమ్మం అన్నా అతడు దాటలేక పోయాడు. ఈ మార్పుకు కారణం గాంధీజీ ఉత్తరం.

జెన్నిఫర్ అతిమర్యాద భావము ప్రవహించింది. “ఒహో!” అంటే “ఓహో” అని మారు పలికింది. చిరునవ్వు నవ్వింది. “చాలా విచారంగా ఉంది. నీతో వాహ్యాళికి రాలే” నంది, “నాకిప్పుడు సినిమాలకు వ్యవధిలేదు” అంది. “ఈ ఏటి పరీక్షలు గడ్డుపరీక్ష”లంది.

వారం రోజులు ప్రయత్నించి, నిష్ఫలుడై నిరాశ పొంది, నిట్టూర్చి విల్లీ వెళ్ళి; జెన్నిఫర్‌కన్న బాగోగులా, ప్రపంచస్థితి, జీవితంలోని నిజానిజాలు తెలుసుకొన్న “మాడలైను” కన్యను పెళ్ళి చేసుకొన్నాడు. పెళ్ళికి జెన్నిఫర్‌ను పిలిచారు. జెన్నిఫర్ అప్సరసలా వేషం వేసుకొని పెళ్ళికి వెళ్ళింది. భార్యాభర్తలకు మంచి వెలగల వెండి భోజనపు గిన్నెల సెట్టు బహుమతి ఇచ్చింది. మాడలైను అందమైనదే!

అయినా జెన్నిఫర్‌నూ మాడలైనునూ పోల్చుకుంటూ స్వర్గంలో నందనవనాన్ని పోగొట్టుకొని మదరాసులో తేనాంపేట తోటను సంపాదించుకొన్నాననుకొని ఒక నిట్టూర్పు వదలి, ఇంతే చాలుననుకొని, విల్లీ మాడ్‌ను తమ మధురమాసాన్ని గడపడానికి నీలగిరి కొండలకు తేల్చుకొని పోయాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

31

నరుడు(సాంఘిక నవల)