పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎం. ఎస్. ఎం. రైల్వే జిల్లా ఇంజనీరుగా ఉన్న యువకుడు, విలియం ట్విన్‌హాo అనే అతడు, జెన్నిఫర్‌ను భార్యగా వాంఛిస్తున్నాడు.

ఎన్నాళ్ళనుంచో ఆ యువకుడు జెన్నిఫర్ వెంట తిరుగుతూ, ఆమెను సుముఖం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

అతడు గుంతకల్లు రైల్వే జిల్లాకు ఇంజనీరు. కేంద్ర స్థానం గుంతకల్లు. అతడు తన స్వంత పెట్టెలో పెద్ద బండిమీద రాయచూరు వరకు, చిన్న బండిమీద హిందూపురం వరకూ, ఇటు కంభం వగైరాదులన్నీ తిరుగుతూ ఉండవచ్చును.

అతడు మదరాసు ఇంజనీరింగు కళాశాలలో చదువుకొనేటప్పుడు, జెన్నిఫరును ఎప్పుడూ కలుసుకొనేవాడు. ఇద్దరూ కలిసి నాట్యం చేసేవారు. ఇద్దరూ కలిసి సినీమాలకు వెళ్ళేవారు. సముద్ర తీరాలకు వెళ్ళేవారు. “విల్లీ” జెన్నిఫర్ అందం చూచి ఆమెకు దాసానుదాసు డయ్యాడు. ఆమె అతడు తన్ను కౌగిలించుకొన్నా ఊరుకొనేది. జుట్టూ, మెడ ముద్దుపెట్టుకోనిచ్చేది. కాని కన్నులు, పెదవులు, బుగ్గలు, గొంతుక, వక్షోజాలను ముద్దు పెట్టుకోనిచ్చేది కాదు. నాట్యం చేసేటప్పుడు, వాహ్యాళిలో నడయాడేటప్పుడు జెన్నీ నడుం చుట్టూ గాఢంగా చేయి పోనిచ్చి తన పక్కకు గట్టిగా అదుముకొనేవాడు.

వాళ్ళ చుట్టాలందరూ జెన్నీ, విల్లీల వివాహం తథ్యం అని అనుకొనేవారు. విల్లీకి జెన్నీ మంచి సంబంధం, జెన్నీకి విల్లీ తగిన వరుడూ అని పెద్దలలో స్త్రీలూ, పురుషులూ ముచ్చటపడేవారు. తండ్రి మాత్రం “జెన్నీ ఇంకా చిన్న పిల్ల” అనుకుంటూ వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోదలుచుకోకుంటే, అతడు ఇంజనీరు పరీక్ష పూర్తి చేసేంత వరకూ పెళ్ళిమాట తలపెట్టవద్దు, అని ఆజ్ఞ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాడు. కాని ఎన్నాళ్ళు ఎదురు చూచినా, ఆ పెద్దలకెవ్వరికీ ఈ శుభ వర్తమానం తెలిసింది కాదు.

విలియమ్సు బి.యి.లో విజయం పొందాడు. తన పెద్దల ప్రాపకంవల్ల ఒక ఏడాది ఆ రైలు కంపెనీ ముఖ్య ఇంజనీయరుగా పనిచేసి ఇప్పుడు జిల్లా ఇంజనీయరయ్యాడు. ఇప్పుడాతనికి ఇరవై అయిదేళ్ళు నిండి ఆరవ ఏడు జరుగుతున్నది.

జెన్నిఫర్ వైద్యకళాశాలలో ప్రవేశించిన కొత్తలో అతణ్ణి గాఢంగా తన పెదవులను ముద్దుపెట్టుకొన నిచ్చింది! బంగారు బంతులులా ఉన్న ఆమె హృదయ కలశాలను అతడు తన హృదయానికి అదిమివేశాడు.

“జెన్నీ, మన వివాహం మాట ఏమిచేశావు? నువ్వు దేవకన్యవు. నువ్వు నడచిన పథంలో నేను నడవడానికన్నా అర్హుణ్ణికాను.అయినా ఈ భక్తుణ్ణి త్వరలో అనుగ్రహించవా?” అని విల్లీ గాఢమయిన మత్తుమాటలతో ఆమె చెవి ముద్దుపెట్టుకుంటూ అడిగాడు.

“విల్లీ నేను వైద్య కళాశాలలో చేరినానుకదా?”

“అయితే ఏమి, మన పెళ్ళి పూర్తి అయినా నువ్వు ఇక్కడే ఉండి చదువుకోవచ్చును. నా చదువూ ఇంకా పూర్తి కాలేదుకదా?”

“అందుకనే ఏ విషయమూ నీ చదువూ, నా చదువు పూర్తి అయిన వెనుక మాట్లాడుకొందాం.”

“ఈలోగా పెళ్ళి చేసుకుందాము అని నిశ్చయించుకుందాము.”

అడివి బాపిరాజు రచనలు - 7

30

నరుడు(సాంఘిక నవల)