పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



5

జెన్నీ జీవితంలో ఇంకో అంకం కూడా గడచిపోయింది. 1936 సంవత్సరాంతానికి ఆమె వైద్యవిద్య పూర్తి అయింది. తర్వాత వచ్చే ప్రసూతి వైద్యాలయ వైద్యపు తయారు పరీక్షా పూర్తి అయింది.

జెన్నిఫర్ మదరాసు ప్రసూతి వైద్యాలయంలో గౌరవ వైద్యురాలిగా చేరింది.

కాంగ్రెసు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినాయి.

జెన్నిఫరు అన్నగారు తన భార్యతో 1938 వ సంవత్సరం మధ్యలో భారతదేశానికి వచ్చి దక్షిణ భారత రైల్వేలో ఇంజనీరుగా ప్రవేశించాడు. లయొనెల్ తిన్నగా భార్యతో మదరాసే వచ్చాడు.

అన్నా చెల్లెళ్ల ఆనందం వర్ణనాతీతమైంది. అన్నగారి ఆనందంకన్న చెల్లెలు ఆనందం ఆకాశానికే ఎగసింది.

అన్నను జెన్నిఫర్ గాఢంగా కౌగలించుకొని, “ఎన్నాళ్ళకు చూచాను అన్నా నిన్ను? నువ్వు ఎంత తెల్లపడ్డావు. అచ్చంగా ఇంగ్లీషువానిలాగే వున్నావు” అన్నది.

అన్నగారి భార్య అసలు ఇంగ్లీషు బాలిక. ఆమెను రాగానే కౌగలించుకొని ముద్దుపెట్టుకొంది. ఎలిజబెత్తు ఎంతో సాధారణంగా బ్రతికిన, ఇంగ్లీషు మధ్య వర్గపు కుటుంబానికి చెందిన పిల్ల. హైస్కూలు విద్య పూర్తియై తండ్రికే కార్యదర్శిగా ఉండేది. ధనం వాంఛించింది. ఏ బెంట్లీ కారులోనో కొన్ని వేల కాసులు ఖరీదుగల దుస్తులు వేసుకొని లండను బజారులో తిరుగుతూ ప్రతి పెద్దషాపులోను అందమైనవి, అతి విలువ కలిగినవి వస్తువులు కొనుక్కుంటూ, తనతో అందాలూ, పురుషత్వమూ వెదజల్లే పురుషుడు అపోలో దేవునిలా కూడా రాగా గులాబి పుష్పపుటాలలాంటి తన చెవికమ్మలు, గులాబిపువ్వులలాంటి తన బుగ్గలు, గులాబి మొగ్గలవంటి తన పెదవులూ ముద్దుబెడుతూ తన్ను గాఢంగా అదిమివేస్తూ, వెన్నెలలా తెల్లనై, స్నిగ్ధాలైన పొంకాలైన తన వక్షోజాలు నలిపివేసే యువకుడు, తన్ను కంగారు పెడుతూ ఉండగా తిరగాలని ఆశించేది, కలలు కనేది. ఆ ఎలిజబెత్తును ఒకనాడు లండనులో లయొనెల్ కారు ప్రమాదంనుండి రక్షించాడు.

ఆ నాటినుండి ఎలిజబెత్ జీవితం మారిపోయింది. భావాలు మారిపోయాయి. స్వప్నాలూ మారిపోయాయి. ఏది చేయకూడని పనో అదే చేసితీరడంలో ఉన్న ఆనందం, రైలు పట్టాలతనంలో లేదు. స్వచ్చమైన ఇంగ్లీషువారు భారతీయుల్ని పెళ్ళిచేసుకోవడం తప్పు. అందుకని ఎలిజబెత్తుకు ఆ పనే చేయాలన్న ఉద్రిక్త భావం కలిగింది. ఆ భావాలకు తగినట్లు తాను నిజంగా లయొనెల్‌ను ప్రేమిస్తున్నది. ఆ విధంగా ఈ వివాహం సుఖాంతంగా పరిణమించింది.

అన్నగారు భార్యతో ఉద్యోగంలో చేరినదాకా, “కానొమారా” హోటలులో మకాముపెట్టి ఉద్యోగంలో చేరగానే తిరుచునాపల్లి పోయి చార్జి పుచ్చుకున్నాడు. అక్కడ లయొనెల్‌కు రైల్వేవారి బంగళా నివాసానికి ఉన్నది. కావలసినంత మంది నౌకర్లు, చాకర్లు; ఎలిజబెత్‌కు ఆనందంగానే ఉంది.

అడివి బాపిరాజు రచనలు - 7

32

నరుడు(సాంఘిక నవల)