పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భవిష్యత్తుగూర్చి, ప్రపంచ రాజకీయాలుగూర్చి, వైద్య విద్య సహాయము - మానవుడు అనే అఖండ విషయాన్ని గూర్చి తన వారితోను, తోటి బాలురతోను చర్చిస్తూ ఉండేది.

జెన్నీ: యూరేషియను జాతి చివరకు గబ్బిలంలా తేలింది. భారతీయులకు ఆ జాతి అంటే గౌరవంలేదు. తమ తక్కువ కులంకన్నా అధ్వాన్నంగా చూస్తారు.

మార్థా: (దూరపుచుట్టం) అవును జెన్నీ! ఇంగ్లీషు వారు మనకీ వారికీ సంబంధమున్నట్టే ఆలోచించరు.

హెన్రీ: (మార్గాభర్త) అవును మార్థీ వాళ్ళ దృష్టిలో మన ఆడవాళ్ళు, వాళ్ళ సైనికులు భారతదేశంలో ఉన్నప్పుడు వాళ్ళ గాఢపురుషత్వ రాక్షసకామం తీర్చడానికి ఏర్పాటయిన, ఒక వీలయిన, ఫరవాలేని, చక్కని సేప్టివ్వాలని!

జెన్నీ: అందుకు ముందర తయారు మన యూరేషియనుజాతి ఆడముండలేగా! భారతదేశంలో, బర్మాలో, జావాలో, మలయాలో, ఇండోచైనాలో, చైనాలో, అమెరికాలో, ఆఫ్రికాలో మనజాతి ఉద్భవించి ఎక్కడా ఉత్తమస్థితి సంపాదించుకోలేక ఎన్ని నీచత్వాలు అనుభవిస్తోందో!

హెన్రీ: రెండు జాతులు కలుస్తాయి. ఈ జాతి పురుషులు ఆ జాతి స్త్రీలను వాంఛిస్తారు, ప్రేమిస్తారు. కాని నల్లజాతి వాళ్ళలో, రంగుల జాతి వాళ్ళలో పురుషులు తెల్లజాతి పురుషుల్ని ప్రేమించకూడదు. కలియకూడదు.

మార్థా: వాళ్ళ పురుషులు తమ కక్కుర్తులు రంగుల జాతి స్త్రీలతో తీర్చుకొన వచ్చును.

జెన్నీ: అవును మార్టీ! నాకు బాధ వచ్చేది ఎక్కడంటే, తమ పురుషుల పశుత్వంవల్ల దేశదేశాలలోనూ ఎవరికీ అక్కరలేని ఒక సంకరజాతి ఉద్భవిస్తే వారిని గురించి ఆ తెల్లజాతివాళ్ళు ఒక్క పిసరు ఆలోచించి వారికి తగిన మార్గం చూపిస్తేనా?

హెన్రీ: ఇందులో నాకు నచ్చింది ఒక్క ముస్లిం సంఘంవారు, ఏ జాతినయినా తమలో కలుపుకుంటారు. ఏ యింటి మిశ్రమాలయినా ఆ మహాసంఘంలో కలిసిపోతాయి. తెల్ల ముస్లింలున్నారు, బంగారు ముస్లింలున్నారు. నల్ల ముస్లింలున్నారు. చీనా ముస్లింలు, జావా ముస్లింలు, నీగ్రో ముస్లింలు భారతీయులు, ఆర్మీనియినులు వగైరా వగైరా అందరూ ఒక బ్రహ్మాండమైన సంఘం.

మార్థా: అవును హెన్రీప్రియా! కాని మన క్రైస్తవ మహాసంఘంలో హిందువులలో ఉన్నట్లు కులాలు కులాలు!!

ఈలాంటి సంభాషణలు ఆ జాతిలో కాస్త చదువుకున్నవారు ఎప్పుడూ చేసుకుంటూ వుంటారు.

వైద్య కళాశాలకు పెందలకడనే వెళ్ళవలసి వున్నది. కాబట్టి జెన్నిఫరు తెల్లవారగట్లనే లేచి, కొంచెం సేపు ఏవో ఆలోచనలతో పక్కలో దొర్లుతుంటుంది. ఆ సమయంలోనే యౌవనస్నాతయై అప్పుడే వికసించు గులాబి పూవై ఉదయించు ఉషాబాలయైన జెన్నిఫరుకు యౌవనపు గుబాళింపు కాంక్షలు ఉద్భవిస్తాయి. ఒళ్ళు జల్లుమంటుంది.

ఉప్పొంగే వక్షాలను అదుముకొని సంబాళించుకుంటుంది. ఆమె వివశ అవుతుంది. ఎవరెవరో తన్నెరిగి తనతో చనువుగా మెలిగే యువకులను తలపోసుకుంటుంది. వారితో


అడివి బాపిరాజు రచనలు - 7

22

నరుడు(సాంఘిక నవల)