పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపర్కము ఊహించుకుంటుంది. ఆ భావము ఆమెకు తృప్తి ఇవ్వదు. తన్ను గూర్చి విరాళి పొందే కోడెగాళ్ళు జ్ఞప్తికి వస్తారు. తన యూరేషియను జాతివాళ్ళు, తన తరగతి బాలురు, తనతో నాట్యం చేసిన తన దూరపు దగ్గర చుట్టాల; బాలురు, తన్ను దగ్గిరగా తీసుకొనేవాళ్ళు, కాంక్షతో గొంతుకు బిగుసుకుపోగా అస్పష్టస్వరంతో మాటలాడేవారు అందరూ జ్ఞాపకం వస్తారు. ఒళ్ళు వేడెక్కుతుంది. కాని ఏదో ఒక అతిదూరపు అతిదగ్గిర కోర్కె అతి స్వచ్ఛమైన వాంఛ, అవ్యక్తమైన ఆశ తన్ను ఆపుచేస్తుంది.

ఒకసారి గాఢ బాలికావాంఛ తీర్చుకున్న మాత్రాన ఆమే ఏదో యమలోకంలో పడిపోతుందని జెన్నిఫర్ నమ్మదు. కాని, ఒక స్వచ్చమైన జీవితం తన అనుభవానికి అనాఘ్రాతమై రావాలి. తానా జీవితాన్ని పొదివికొనడానికి అనాఘ్రాతమై ఉండాలి. ఈ అతి ఎత్తైన కాంక్షను అనుభవించడానికి ఎదురు చూస్తోంది.

ఆ కాంక్షాదినాల్లో, అతిచదువు దినాల్లో, రోగాలను గూర్చి తెలుసుకొనే దినాల్లో, మనస్తత్వాన్ని గూర్చి విచారణ చేసే దినాల్లో ఇంగ్లండులో లండను మహానగరంలో నివసించే లయొనెల్ దగ్గర నుండి చెల్లెలు జెన్నిఫర్‌కు ఉత్తరం వచ్చింది.

ఇదివరకే అనేక ఉత్తరాలు వచ్చినాయి. కాని ఈ ఉత్తరంలో ఒక ముఖ్య విషయం వ్రాశాడు.

భారతీయ అసోసియేట్ ఛాంబర్సు,

2వ అంతస్తు, 75వ వార్డు స్ట్రీటు సోహో

6 అక్టోబరు, 1934.

ప్రియమైన జెన్నీ!

నా కీ ఉదయం ఒక మహత్తరమైన సన్నివేశం జరిగింది. నా జీవితంలో అది ఎంతో మహత్తరమైన మార్పు తీసుకొని వచ్చేది.

మన ఇంటిపేరున్న ఒక చితికిపోయిన పెద్ద కుటుంబపు అమ్మాయి ఇక్కడ ఒక కంపెనీలో మేనేజింగ్ డైరెక్టరుకు ఆంతరంగిక కార్యదర్శిగా ఉంది. ఆ అమ్మాయికి నాకు ప్రథమ పరిచయం మేము కాపురమున్న మేడలోనే జరిగింది.

ఈ మేడలో రెండవ అంతస్తులో ఆమె చుట్టాలు ఉన్నారు. ఆమె తరచుగా ఇక్కడకు వస్తూ వుంటుంది. ఇప్పటికి మూడు నెలల క్రితం ఆమె నేను, తారసిల్లడం విచిత్రంగానే! ఆమెను నేను ఓ మోటారు బారి నుండి రక్షించాను. అక్కడనుంచి మా స్నేహం వృద్ది పొందింది. మా స్నేహం గాఢమై ప్రేమ పరిణామం పొందింది.

మా మా కుటుంబాల సంగతులు తెలుసుకోడంలో మన పూర్వీకుడయిన మేజరు అన్నగారే ఈ కుటుంబానికీ పూర్వీకుడు.

అతి సంతోషంతో ఆ పూర్వపు చుట్టరికం తలుచుకుంటూ ఎలాగో కాలక్షేపం చేస్తూ గౌరవంగా బ్రతుకుతున్న నా ప్రాణప్రియ ఎలిజబెత్ తల్లితండ్రులకడకు మేము ఇద్దరం వెళ్ళాం.

వాళ్ళు నన్నెంతో గౌరవం చేశారు. కాని నా, ఎలిజబెత్తుల వివాహానికి ఒప్పుకోలేదు. ఎలిజబెత్తు అన్నగారు బాగా విముఖుడయ్యాడు. సంపూర్ణ భారతీయుణ్ణి తన చెల్లెలు చేసుకోడానికి ఒప్పుకుంటాడట గాని, యూరేషియనును చేసుకోడానికి ఒప్పుకోడట.


అడివి బాపిరాజు రచనలు - 7

23

నరుడు(సాంఘిక నవల)