పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బయలుదేరిన పురుషునికి అతడు ఎంత తక్కువ బుద్ధి శ్రేణిలో వాడైనా లోకజ్ఞానం బాగా నచ్చితీరుతుంది. బుచ్చివెంకట్రావు తన జీవితానికి నిచ్చెనలు అమరించి, పైకి వెళ్ళాలి అన్న పట్టుదల కలిగిన సంకల్పజీవి. అతడు సముద్ర దూరాలు ఈదుకు వెళ్ళిన మనిషి. యుద్దంలో రంగూనుకు వెళ్ళినప్పుడు సముద్రం ఓడమీద దాటినవాడే! ఏ రేవైనా సముద్రానికి అవతల వొడ్డు రేవు కాదు. సముద్రం వేరు. రేవులు వేరు. రేవులన్నీ సముద్రానికి సేవకులవంటివి అని బుచ్చివెంకట్రావు ఊహించుకున్నాడు.

తాను తన జీవితంలో గొప్పవాడవటం తన పద్మావతి కొరకే. తనకూ తన పద్మావతికీ ఒకేసారి చదువు కావాలి. తన జీవితం చెట్టు అయితే ఆ చెట్టంతా నిండి వికసించిన పూవులప్రోగు పద్మావతి... పూవులు లేని చెట్టుకు అందమే లేదు. చేట్టులేక పూవులు ఎట్లా వికసించగలవు?

ఇద్దరికీ ఒకడే ప్రయివేటు మాష్టరు. ఇద్దరికీ ఒకే పాఠాలు చెప్పుతున్నాడు ఆ మాష్టరు. పద్మావతి దబ్బున గ్రహిస్తుంది. దబ్బున మరచిపోతుంది. బుచ్చివెంకట్రావు ఒక పట్టాన పాఠం త్వరగా గ్రహించలేడు. గ్రహించిన పాఠం త్వరగా మరచిపోడు. కాబట్టి తన భార్యకు తానే రెండవ గురువైనాడు వెంకట్రావు. ఏ పాఠమైనా నాలుగుసార్లు త్వరగా గ్రహించి వెంటనే మరచిపోయిన తరువాత ఐదవసారి పద్మావతికి పాఠం శాశ్వతంగా వచ్చేది. ఈ విధంగా ప్రవాహాలు సుళ్ళు సుళ్ళుగా వారిద్దరి జీవితాలలోకి జ్ఞానం ప్రవహించుకు రాసాగింది. ఆ జ్ఞానంతోపాటు లోకానికి కప్పివున్న తెరలు ఒక్కొక్కటే పైకి చుట్టుకుపోసాగాయి.

పద్మావతి భర్తను తన్ను కూడా ఈ ప్రదేశాలకు ఆ ప్రదేశాలకు తిప్పి, ఉత్తమ గాయకుల పాటలు తాను వినేటట్టు చేయవలసిందని ప్రార్థించింది. వాళ్ళిద్దరు సంగీత సభలకు మద్రాసు వెళ్ళసాగారు. వారిద్దరూ రామేశ్వరంవరకు ప్రయాణం చేసినప్పుడు దర్శనం చేసికొన్న తంజావూరు, చిదంబరం, శ్రీరంగం, మధుర, రామేశ్వరం మొదలైన దివ్యక్షేత్రాలలో ప్రత్యక్షమైన దేవాలయాల రీతిగానే కర్ణాటక బాణి ఉంటుంది. రాగాలు, మూర్చనలు, కీర్తనలు, గతులు, తాళాలు, క్షేత్రాలై, మండపాలై ఉత్తుంగ గోపురాలై, విమానాలై పద్మావతికి గోచరించినవి. ఆమెకు ఆనందము కలిగినది. భయము వేసినది.

ఏ సుబ్బులక్ష్మో, శమ్మంగుడో, కర్ణాటక సంప్రదాయ ప్రపంచమును ఇంద్ర జాలికులులా ప్రత్యక్షం చేసేటప్పటికి పద్మావతి దిగ్భ్రమచెంది అతిలోకమైన దివ్య మాధుర్యంలో మైమరచిపోయి స్థాణువులా అయిపోయేది.

పద్మావతి: నాకీలాంటి సంగీతం ఏలా వస్తుందండీ? ఈ రాగాల పోకడలే నా గ్రహణశక్తికి మించిపోతున్నాయి. నేను ఎన్నాళ్ళు తపస్సుచేస్తే, ఆ తపస్సు ఎన్ని జన్మలు వీడని దీక్షతో ఆచరిస్తే, నాకు ఈలాంటి సంగీతం అబ్బగలదు! ఎందుకు నాకు ఈ సంగీతం చెప్పించడం. ఆ సుబ్బులక్ష్మి అమృత ప్రవాహం ముందర నా కంఠం ఉప్పునీళ్ళ కాలవలా కనపడుతుంది.

బుచ్చి వెంకట్రావు: ఓసీ వెర్రినాగమ్మా! ఒక్క రోజులో సుబ్బులక్ష్మి తనకున్న యావత్తు సంగీతశక్తితోను వూడిపడిందా? ఎన్ని సంవత్సరాలు కష్టపడిందో. నేను లక్షాధికారిని కావాలంటే ఒక్క రోజులో కాగలనా చెప్పు.

అడివి బాపిరాజు రచనలు - 7

102

జాజిమల్లి(సాంఘిక నవల)