పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మ: అంత విద్య మన నరసింహమూర్తి మాష్టారు చెప్పగలరనేనా?

బుచ్చి: నరసింహమూర్తి మాష్టారు కావలి స్టేషను అనుకో, ఇంకా బిట్రగుంట, నెల్లూరు, గూడూరు జంక్షను చెన్నపట్టణం ఉన్నవి కదా?

పద్మ: ఎన్ని వుంటే ఏమండీ? నా కెట్టావస్తుంది ఆ సుబ్బలక్ష్మి కంఠం.

బుచ్చి: ఎవరందాలు వారివి; ఎవరి గొప్పలు వారివి. ఏమంటావ్! నీ కంఠంలో శ్రీ పి.సుబ్బలక్ష్మి కంఠంలో కనపడేలేదు! ఎవరికున్న గొప్ప వారిది.

పద్మ: ఐతే నన్ను పట్నం తీసికెళ్ళో లేకపోతే దక్షిణాదికి తీసుకుపోయో గొప్పవారి దగ్గర సంగీతం చెప్పించండి.

3

బుచ్చి వెంకట్రావు ఎండురొయ్య పప్పు ఎగుమతి మద్రాసునుండే చేయ సంకల్పించాడు. తన ఆఫీసు కావలినుండి మద్రాసుకు మార్చాడు. కావలినుండి మద్రాసువరకూ ఉండే పల్లె గ్రామాలలో పల్లెవాళ్ళను తన కంపెనీకే వారి రొయ్య పప్పు అమ్మేటట్టుగా ఏర్పాటు చేసికొన్నాడు. తన ఆఫీసు వాల్టాక్సు రోడ్డులో కుదుర్చుకొన్నాడు. తను కాపురం ఉండేందుకు రాయపేటలో ఇల్లు కుదుర్చుకొన్నాడు. బ్రహ్మప్రళయంమీద ఊరంతా జల్లిస్తే ఆ ఇల్లు దొరికింది. భార్యకు సంగీతం చెప్పే నరసింహమూర్తి మాష్టారును కూడా తీసికొని వచ్చాడు.

పద్మావతికి చెన్నపట్నం వచ్చినప్పటి నుంచీ జీవితం ఒక అనంతమూలికలా అయిపోయింది. కావలసినన్ని జాజిపూవులు, కావలి వచ్చినప్పుడే ఆమెకు మొదటిసారి జాజిమల్లె ప్రత్యక్షమైనది.

ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కరి జీవిత ప్రవాహాన్ని నూతన పథాలకు త్రిప్పుతుంది. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క బాలిక బ్రతుకునే మారుస్తుంది. పెద్దజాజిపువ్వును మదరాసులో జాజిమల్లిపూవు అంటారు. తెలుగుదేశంలో పెద్దజాజి అని మాత్రమే పిలుస్తారు. అసలు జాజికి మల్లికి ఉద్భవించిన పువ్వు అయివుంటుంది. అటు మల్లిపువ్వులోని సౌందర్యాలూ ఉన్నవి. ఇటు జాజిలోని సుకుమారతా ఉన్నది. ఏదో వివశత్వం కలిగించే మత్తువాసన నక్షత్రరూపమై, నక్షత్ర లోకాల ఆవలిదశలకు కొనిపోయే రూపసౌందర్యము, స్వచ్ఛజాజిమల్లి పూవులో నృత్యమాడుతూ ఆమెకు గోచరించినవి. ఆమె మల్లెపూవు లెరుగును; నాగమల్లి పూవులూ ఎరుగును. నాగమల్లి చెట్లు వాళ్ళ పల్లెదగ్గరనే ఉన్నవి. వర్షాకాలం రాగానే అవి చక్కగా వికసించి వాన జల్లులతోపాటు పూవులు జల్లులు జల్లులై కురుస్తవి. తెల్లవారగట్లే లేచేది పద్దాలు వాటిని ఏరుకోటానికి. చెవులలో జూకాలుగా అమరించుకొనేది. దండలు గుచ్చి మెడలో వేసుకొనేది. తన చింపిరి జుట్టులో అలంకరించుకొనేది. ఒక్కొక్క పువ్వూ ముచ్చిక తెంపి ఆ పువ్వులోని తియ్యటి పాలను తాగేది. సన్నగా బూరాలు ఊదేది.

ఆ నాగమల్లి పువ్వులు జాజిమల్లి ఎదుట సామ్రాజ్ఞి ఎదుట రాణులులా అయిపోయినవి.నాగమల్లి మల్లియపీఠానికి దారి చూపిస్తుంది. మల్లిక జాజిమల్లి సింహాసన వితర్ధిక కడకు గౌరవంగా తీసికొని వెడుతుంది.

అడివి బాపిరాజు రచనలు - 7

103

జాజిమల్లి(సాంఘిక నవల)