పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ గుచ్చము

ఎన్నో అందాలు ఎందరి జీవితాలలోనో ప్రత్యక్షం కాకుండానే, భావమాత్రంగానైనా, దర్శనం ఇవ్వకుండానే ఈ జగత్తు నడిచిపోతూ ఉంటుంది. కాని ప్రాథమికమైన సౌందర్యభావం మానవులందరి జీవితంలోనూ వికసించి ఉండనే ఉంటుంది. జీవితాన్ని నిజంగా అర్ధం చేసికోలేని కర్కశ వాదులు రెండు చేతులా ఆ కాస్త అందాన్ని కూలద్రోసుకొని ధూళి నిండిన దారులలో యాత్రసాగిస్తారు.

పల్లెటూరివారి జీవితాలలో కవిత్వమూ, సంగీతమూ నిత్యకర్మలో అంతర్భాగమై పోతాయి. అవతల ఒడ్డులేని సముద్రము, లోతు తెలియని కడలి పద్దాలుకు ఎప్పుడూ ఏవో చిరుగాలులు ప్రసరించిన యేటి అలలూ, ఆలోచనలను ఉద్బవింపజేసేవి.

పల్లెవారికి సముద్రం ఒక మహారాజ స్నేహితుడు. కాబట్టే వాళ్ళ జీవితాలలో అనంతమైన దూరాలు, లోతులు, లోతులు మించిన పారాలు! వాళ్ళు ఓడలు నిర్మించే విశ్వకర్మలూ, ఆ ఓడలు దెసల కడవలకు తేలిపోజేసే నావికులూ కాగలిగారు.

పద్దమ్మ కూడా తండ్రి తెప్పనావమీద చేపలకోసం ఉదయ దిశాంచలాలు దాటి వెళ్ళేటప్పుడు తానూ వెళ్ళింది. ఉప్పునీళ్ళలో చేపపిల్లలా ఈదగలగేది. ఎంత మునిగినా, లోతులందని నీలజలాలు, ఎంత ఈదినా దూరమందని కెరటాలు; కొండవిరిగినట్లు ఒడ్డుకు దొర్లిపడే తరంగాలు, ఆకాశాలతో గుసగుసలుపోయే కల్లోలాలు; ఏ కడనుంచి, ఏ కడకు పోతాయో తెలియని అవ్యక్తవాంఛల్ని ఎన్నో అందిస్తూ ఉండేది.

ఏడు సముద్రాలకూ పెంపుడు బిడ్డ పద్దమ్మ. ఆ సముద్రాల అమృతం అంతా పద్దమ్మలో నవనవలాడుతూ ఉండేది. ఆ జవ్వని కంఠమూ లావణ్యం దాల్చింది.

సంగీతం మేష్టారు నరసింహమూర్తి నేడు పద్మావతి అయిన పద్దాలుకు గాన విద్యా శిక్షణ ప్రారంభించాడు. కెరటాలలోని, తుఫానులలోని, ఆకాశనీలాలలోని అనంత దూరాలలోని మాధుర్యాలు వాకలు కట్టించుకొన్న ఆమె కంఠం ఆ శిక్షణకు ఎలా లొంగుతుంది? సముద్రానికి ఆనకట్టలు కట్టగలరా? లోతులకు కొలతలు వేయగలరా? నరసింహమూర్తి కష్టపడి కర్నాటక బాణి సంపాదించుకొన్న సంగీతం మేష్టారు. కావలిలో, కావలి చుట్టు ప్రక్కల గ్రామాలలో, సంగీత సభలు చేసి “పాటకుడు” అని పేరుపొందినవాడే! అయితే మాత్రం సంగీత సముద్రాలకు వారధులు కట్టడానికి అతడు శ్రీరామచంద్రుడా ఏమన్నానా!

2

పద్మావతి ఒంటినిండా నగలు దింపాడు బుచ్చి వెంకట్రావు. ఆనాటికి అవి పదమూడు వందల ఏభై రూపాయల మూల్యం కలిగిన బంగారం నగలు. తాను పెద్ద చేపల వర్తకుడవుతున్నాడు. యుద్ధంలో దేశాలు తిరిగివచ్చిన వాడవటంచేత ఇంతో కొంత లోకజ్ఞానం సంపాదించుకున్నాడు. దేశాలు తిరిగేవారికి దుమ్ముధూళిలా అక్కర్లేదనుకొన్నా జ్ఞానం కాస్త అంటుకు తీరుతుంది. కాని ఇది ఏమిటీ అని ప్రశ్న వేసుకొనే యోగంతో

అడివి బాపిరాజు రచనలు - 7

101

జాజిమల్లి(సాంఘిక నవల)