ఈ పుట అచ్చుదిద్దబడ్డది
56
జగత్తు - జీవము
భూతకాలమూలాన్ని ఛేదిస్తే వృక్షం నశిస్తుంది. భూతకాల విషయాలను పరిశీలించి, విమర్శించి భవిష్యత్తునకుపకరించు నియమాలను ఏర్పాటు చేయడమవుతూంది. భూతకాల మసత్యమైతే మన భవిష్యత్తు గాలిమేడవలె కూలిపోతుంది. కాని, మనతో సంబంధం లేనిదే కాలాన్ని భావించుకోలేము. ఒక విషయం "ఎప్పుడో జరిగింది" "ముందు వాటిల్లుతుంది" అన్నప్పుడు ఆ విషయాన్ని చూచినవారో చూచువారో, అనుభవించినవారో అనుభవించువారో అగు మానవులతో దానికి సంబంధం ఏర్పరుస్తున్నాము. కాబట్టి, కాలానికి స్వతంత్రమైన ఉనికిలేదని స్పష్టమే. అదీగాక, ఆకాశంతో సంబంధం లేని కాలాన్ని ఊహించుకోలేము. అగుట, వ్యక్తకాలమే ఆకాశమని, అవ్యక్తంగానున్న ఆకాశమే కాలమని విజ్ఞులు భావిస్తున్నారు.