జగత్తు - జీవము
4. కాలాకాశవైచిత్రి
జగత్తను ఈ మహా పరిశోధనా గారంలోనికి అన్వేషణ దృక్కు లంపినప్పుడు సృష్టియందలి విచిత్రము లప్పుడప్పుడు గోచరిస్తాయి. ఈ అనాది పరిశోధనాగారంలో అనుక్షణం సంభవిస్తూన్న అద్భుత ప్రయోగాలే అగోచరుడుగానున్న పరిశోధనాధ్యక్షుని రచనా కౌశలానికి, చాతుర్యానికి నిదర్శనాలు. ఈ అనంత పరిశోధనా గారంలో సృష్టి స్థితిలయాలు నిత్యం జరుగుచున్నాయి. పరమాణువులోని ఎలక్ట్రాను పరివారాలు శిథిలమై మహోగ్రమైన తేజోష్ణాలు ఒకవంక జనిస్తున్నాయి : పరమాణువు భస్మమై ఆ విభూతినుండి శక్తి జనిస్తూంది. అతి దీర్ఘయానంచేసి జవం కోల్పోయిన శక్తి ఆకాశరహఃకోణాలలో ద్రవ్యంగా పరివర్తనమొందుతూంది. నాతి దూరంగానున్న ద్రవ్యఖండాలు పరస్పరాకర్షణ బలబంధములచేత స్తోకనక్షత్ర రాశులుగ విభజింపబడి కుటుంబములట్లు ఆకాశయానం చేస్తూండగా, అతి దూరస్థ తారాకుటుంబములు పరస్పర విముఖములై ఆకాశార్ణవంలో చెదిరిపోతున్నాయి. జగత్సర్వము అత్యద్భుత పరిణామ మొందుతూంది !
శిశువుకి సైతం కండ్లు తెఱవగానే ఆకాశం కనిపిస్తుంది. కనుచూపుమేఱ ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. కోట్లకొలది మైళ్ళ దూరంగానున్న నక్షత్రాల కాంతి ఆకాశయానంచేసి మన కంట్లో పడినప్పుడే ఆ నక్షత్రాలు గోచరమౌతాయి ; ఆకాంతి మన కంట్లో పడుతున్నంతకాలము అవి గోచరిస్తూనే ఉంటాయి.