జీవితాంతము
47
కండరముల (papillae) చేర్పుతో, చక్షురాదీంద్రియముల లేశ పరివర్తనముతో ఆమహోగ్రోష్ణమే నవనవోన్మేషవసంత శీతలంకాగలదని, ఆనిశ్శబ్దమే మధురమనోహర దివ్యగానం కాగలదని, ఆ నిశీధమే మహోజ్జ్వల విశ్వ తేజస్సు కాగలదని తెలిసికొనుట సమంజస మేమో ! ఈ ఆగంతుక జీవితమే భయానక విపత్తని, ఆనందాను భూతిని నిరోధించు కాలాకాశముల ఛేదించి మనస్సును జగదానంద సాగరంలో జొరనిచ్చునది మృత్యువేయని భావించుట ఉచితమేమో ! బృహత్పరిమాణంగల నక్షత్రగోళాల లయము, నాశనము, జ్వాలా తప్తము, అన్యోన్యసంఘర్షణము, చూర్ణీకరణము : ఇవన్నియు మహత్ప్రయోగారంభములు. అత్యద్భు తాశోదయములు, అనంత దుర్‌జ్ఞేయజనిత అమందానందములు. ఈ గోళములు కఱుడు గట్టితేనేమి. మహాగ్నిజ్వాలలో భస్మమైతేనేమి, ఒండొరులు వెన్నాడితేనేమి, జనంతో పరిగిడితేనేమి ? మానవశరీరంలోవలె విషాదకరంగా సంయోగింపబడక స్వేచ్ఛగానున్న మనస్సు ద్రవ్యము నిర్మలానంద మొందక తప్పదు. జననము, పునర్జననము తప్ప మరణ మచ్చట లేదు.
ఈ భువనము లొకనాడు సమగ్రనిశ్చలావస్థలో స్తంభీ భూతమైపోయిన పోవుగాక ! అంతటితో వాటికి విపత్తు, వైఫల్యము, మరణము వాటిల్లినదనికాదు ; ఆనంత్యంలో అక్షీణమైన అతిమాత్ర ప్రమాదముల నేవగించి సుందరము, మహోత్కృష్టము, ప్రశాంతము అగు నిశ్చలసమాధి పొందినట్లు. నిశ్చల సమాధియే పరమావధికదా !