పుట:Jagattu-Jiivamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవితాంతము

45

కార మయమైయుండక, కాంతి లతావ్యాప్తమైన మహోజ్జ్వల తేజ స్సాగరమై యుండెడిది -

మన పరిమిత జీవితానికి అపరిహార్యమైన జ్ఞానంలోపడి అట్టిట్టల్లలాడెదము. అగోచరమైన అనంతాన్ని పొందకుండ మన ఇంద్రియములే నిరోధించుచున్నవి. మనుష్యులమై యున్నంత కాలము ఈఅనంత విశ్వతత్త్వాన్ని రవంతైనా బోధపరచుకొనుటకు సాధ్యం కానట్లున్నది. మన పరిమితభావానికి మహోత్కృష్టాశయాలుగా తోచినవాటికై హృదయపూర్వకంగాప్రయత్నించి, అనంతంలో ప్రయత్నములు నశించనేరవని నమ్ముటే జన్మసాఫల్యము.

పై అసాధ్యప్రశ్నలు భయోత్పాదకములు కాకుండుగాక ! మరణానంతరమున మన భవిష్యత్సందర్భంలో ఈ విషమప్రశ్నల కుత్తరం కనుగొనవలసిన ఆవశ్యకతలేదు. విశ్వము నిరంతర పరిణామ మొందుచున్నను లేకున్నను, యావద్విశ్వంగాని, అందలి భాగాలుగాని దుఃఖభాజనమౌట కుత్పన్నము కాలేదు. విశ్వమందొక బిందువును వేధించినను భువనాలను వేధించినట్లే ; భువనాలను వేధిస్తేవిశ్వం తనఅంగములను, తన్మూలంగా తనను వేధించికొనినట్లే !

విశ్వమే ఆత్మశాసనము, ఆత్మాధికారము కావలసియున్నది. లేనిచో, అన్యాధికారానికి అంజలి ఘటింపవలెను. అది అసంభవము. విశ్వము దుఃఖభాజనమైతే, దుఃఖభాజన మగుటకే నిశ్చయించుకొన్నది. విశ్వమందు ఉన్మాదం రేకెత్తినట్లు మనకు గోచరిస్తే విశ్వ నియమాలకు వ్యతిరేకంగా మనబుద్ధి పరుగిడుచున్నదనియే అర్థము. ఊహాతీతమైన విషయాలను గ్రహింపనేరక తబ్బిబ్బైనదనియే భావము !