Jump to content

పుట:Jagattu-Jiivamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

జగత్తు - జీవము

విశ్వమందు సర్వమానందానుభూతిలో నున్నది. లేక, యాతన, దుఃఖము, రణరణకము ఎరుగని నిర్మలావస్థలో నున్నది. భూలోకానందము మాత్రమేమి ? యాతన, దుఃఖము, రణరణకము లేకపోవుటేకదా !

ఆనంత్యసందర్భంలో సుఖదుఃఖాలను గూర్చి భావించుటే అజ్ఞానము. సుఖదుఃఖవిషయమై మనం పెంపొందించుకొను భావములు మనల నతిక్రమింపజాలనంత భంగురమైనవి. మానవజాతికి ప్రత్యేకమైనవి, ఈ కళేబరంతో రాలి నశించునవి. జన్మసమయమున మన నరాలకొక ప్రమాదం సంభవించినది. తన్మూలంగా స్వల్ప దుఃఖాలకే అవి సంక్షోభిస్తవి. లేదేని, ఐహిక దుఃఖంలో సుభాన్ని పొందగల సామర్థ్యమే సమకూడేది. ఐహికచింతనంలో ఉపద్రవములు, మరణములు, విపత్తులు, తీవ్రసంతాపములు తప్ప మనకు వేరొండు గోచరించవు. శీతలమును, తమోవృతమునైన ఏకాంత అంతర్నక్షత్రాంతరాళములను తలచి కంపించెదము. ఒకసారి కఱడుగట్టుచు, వేరొకసారి మహాగ్నిజ్వాలల కాహుతియౌచు, ఇంకొకసారి పరస్పరం డీకొనుచున్న భ్రమణాయమాన భువనగోళాలు మనభూమికన్న దుఃఖాస్పదమైనవని భావించెదము. జగత్తు యొక్క మేధాశక్తి మతిభ్రష్టయైన నిష్ఠురశాసకమని, తీవ్రోన్మాదియై ఆత్మవేధనయందుత్సాహియైనట్లూహించెదము. చండభానునికన్న సహస్రాంతం పెద్దలైన నక్షత్రాలకు, గణితమందలి అంకెలుగాని, భాషలోని మాటలుగాని పరిమాణ స్వభావములను నిర్వచించలేని నెబ్యులాలకు మన జ్ఞానక్షణికత, నరాల దౌర్బల్యము ఆరోపించెదము. ఆరోపించి, ఆమహోగ్రతాపంలో, ఆ విపరీత శీతలంలో, జీవం వర్థిల్లజాలదని విశ్వసించెదము. మన చర్మానికి కొద్ది