Jump to content

పుట:Jagattu-Jiivamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవితాంతము

31

ఆయాసమొందుతారు. అందుచేత నిద్ర నిందార్హమా ? అజ్ఞాన మృగాళికన్న అధిక మరణదుఃఖమనుభవింపచేయుటకే మనజ్ఞాన ముపయోగమగుచున్నది. హాయిగా ప్రతిరాత్రి నిద్రావివశుడైనట్లు, కాలమాసన్నమైనంతనే ఆత్మజ్ఞానోదయమైనజీవి, ఆనందవివశుడై ఐహికబంధనములనుత్తరించును. మృత్యుస్వరూప మెరిగినవారికి సుషుప్తివలె మృత్యువుకూడ ఆనందప్రదమగుటకు సందియములేదు. మృత్యువునుండి అంత్యఘడియల యాతన నుత్తరించినప్పుడు నిర్భయంగా మరణించగలరు. పరలోకావాసం సౌఖ్యప్రదమని విశ్వసించ గలరు.

మరణపూర్వము జీవిపొందు భీకరవేదననేకాక, మరణానంతర పరలోక దుఃఖాలనుసైతము మృత్యువునకారోపించి, మృత్యు స్వరూపాన్ని బీభత్సంగా చిత్రించుకొనుట పరిపాటి. జీర్ణానికే నిర్ణీతమైన పాంచభౌతిక శరీరాన్ని దహించేది మృత్యువా ? జీవాత్మను పరలోక యాత్రకు గొనిపోవునది మృత్యువు; జీవియొక్క ప్రాణానికి విముక్తి ప్రసాదించునది మృత్యువు. శరీరాన్ని దహించేది మనము, వాపోయేది మనము. జీవియొక్క పూర్వాపరాలతో మృత్యువున కెట్టి సంబంధము లేదు. మృతకళేబర సంస్కారము పూర్తియగుసరికి మృత్యువెన్నిలోకాలు దాటిపోతుందో ? భావశిఖరోన్నతాలనుండి సమీక్షిస్తే, పుష్పావసానమునకు, శిలావిశీర్ణమునకు, మాంసక్షయమునకు ఆవంత భేదం లేదు. కాని, విశీర్ణకళేబర దృశ్యం మహాఘోరంగా, హృదయ విదారకంగా ఉంటుంది. పై సత్యం గ్రహించి సమత్వ మలవడచేసికొన్నప్పుడు మనోవైకల్య ముండనేరదు. అగ్నిజ్వాలలో పుష్పించు అమరజన్మమే మృత్యువు. కాబట్టి, ఉత్తరక్రియలగూర్చి విచారింపనక్కరలేదు.