జీవము
15
స్పష్ట్యాది మానవచరిత్రనంతటిని క్షణకల్పంగా తోపించు ఊహా గమ్యమైన దీర్ఘ పరంపరగా ఉంది. ఆకాశమంటే అనంతమై తారకాగ్రహాలను పరస్పరమగణిత దూరస్థములు కావించి ఏకాకులట్లు భ్రమింపజేస్తూంది. విశ్వద్రవ్యమంటే అపరిమితమై మన భూద్రవ్యానికి చెప్పరానన్నిరెట్లు అధికంగా ఉంది. కావున విశ్వద్రవ్యంలో అణుప్రాయంకన్న సూక్ష్మమై, కాలమహార్ణవంలో ఆకాశవిభాగంచే ఏకాకియై స్పురించు భూమిపై నున్న మనకు విశ్వవిమర్శనం భయోత్పాదకం కాకతప్పదు. విశ్వద్రవ్యం జీవాన్ని నిరాదరించి, జీవాభి వృద్ధికి విముఖమైనట్లు తెలిసినప్పుడు భయకంపితులమౌట సహజమే ! ద్రవ్యంతప్ప శూన్యాకాశంలో అధికభాగం జీవం గడ్డకట్టుకొని పోవునంత శీతలంగానుంది. జీవం తాకడానికికూడ వీలులేనంత మహోగ్రంగా ద్రవ్యముంది. జీవప్రతికూలమగు టేకాక జీవవినాశక సామర్థ్యంగల పలువిధములగు కిరణప్రసారాలు (Radiations) ఆకాశంలో వ్యాపించి నక్షత్రగ్రహమండలాలను అశ్రాంతం మర్దిస్తూన్నాయి. కాగా, జగత్తు జీవానికి విరోధం వహించినట్లు గోచరిస్తూంది.
కేవలం పొరపాటున కాకపోయిన ప్రమాదవశంగా యిట్టి విశ్వంలోనికి మనం విడివడితిమని కొందరి విజ్ఞానుల అభిప్రాయం. విశ్వంలో ప్రమాదాలు వాటిల్లుచుంటాయి. ఈ రీతిగా చాలకాలం విశ్వం పరిఢవిల్లినదంటే ఊహింపదగు ప్రతిప్రమాదం సంభవించడానికి అవకాశముంది. జాత్యంధువులట్లు ఆకాశంలో నిరంతర సంచారమొనర్చు కోటానకోట్ల నక్షత్రాలకు పలువిధములైన ప్రమాదాలు కలుగవచ్చును. కాని గ్రహకూటోద్భవానికి కావలసిన ప్రత్యేకప్రమాదం కొద్దితారకలకే వాటిల్లుతుందని ఒక సిద్ధాంతం. జగత్తులో గ్రహకూటాలసంఖ్య అతిస్వల్పమని గణితజ్ఞులపరిశీలనం.