4
జగత్తు - జీవము
దృగ్గోచరమైన నక్షత్రాలు, యంత్రగోచరమౌతాయని ఆశించిన నక్షత్రాలు గణించి, పట్టీవ్రాయగా అనంతాకాశంలో ఒకబిందువు పరిశోధించినట్లౌతుంది. ఈ అనంతంలో నిమజ్జనమగుటకు పూర్వం నక్షత్రాలవిషయం విచారించవలసిఉంది.
మన సౌరమండలానికి అధినాధుడైన సూర్యుడు అనేకకోట్ల సంవత్సరాలనుండి నిమిషానికి 250,000,000 టన్నులు చొప్పున తేజోష్ణప్రసారంగా తనద్రవ్యాన్ని వ్యాపింపచేస్తూ క్షీణిస్తున్నాడు. సౌరమండలంలో సూర్యునిస్థానే ఆదూరంలోనే జ్యేష్టానక్షత్రమున్నట్లయితే, ఉదయాస్తమయాలప్పుడు ఆకాశంలో ఆరవభాగం ఆక్రమించేది. విపరీతపరిమాణంగల ఆర్ద్రానక్షత్రాన్ని చెరిపి సూర్యులుగా మారుస్తే సుమారు 30,000,000 సూర్యులేర్పడేవారు.
ఒక నెబ్యులానుండిపుట్టిన సుమారు, 3,000 కోట్ల నక్షత్రాలలో మనసూర్యుడొకడై యుండవచ్చును. ఇట్టి నెబ్యులాలు కోట్లకొలది యంత్రగోచర మౌతున్నాయి. వాటిలో వెలుగు చుక్కవలె మనకంటికగుపించు నక్షత్రాన్ని యంత్రంతోచూస్తే. అది కొన్నివేల నక్షత్రాల సమూహం అని తెలుస్తుంది.
ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో, అన్ని మృతనక్షత్రాలు కూడ ఉండవచ్చునని విజ్ఞానులు (Scientists) చెప్తారు. స్వయం ప్రకాశంలేని కాలనక్షత్రమే మృతనక్షత్రం. ఆకాశ అంధకారంలో అట్టిది మనకగుపించదు. శని - గురు - శుక్రాదిగ్రహాలు నక్షత్ర కళేబరాలని చెప్పవచ్చును. మృతనక్షత్ర శ్మశానమనదగు అనంతాకాశంలో మనకు తేజోష్ణా లనుగ్రహిస్తూ, జీవరక్షకుడైన సూర్యునివంటి జీవప్రదాతల ప్రాపకభాగ్యంలేని మృతనక్షత్రాలు బహుళంగా సంచరిస్తున్నాయి.