Jump to content

పుట:Jagattu-Jiivamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగత్తు

3

అయితే, జీవకోటికి తలమానికమై. విశేష శేముషీసంపన్నుడై, ప్రజ్ఞాన్వితుడై, ఆసక్తిపరుడైన మానవుడు పరాజయాన్ని సులభంగా స్వీకరించడు. అడ్డంకులు అధికమౌతూంటే, పట్టుదల పూనిక మరింత ప్రబలమౌతాయి. అది మానవస్వభావం. ఆశాబద్ధమైనజీవి మానవుడు యుగాలతరబడి విజ్ఞానసోపానాలు ఆరోపిస్తున్నాడు ; ప్రమాదవశాత్తు ఒకప్పుడు అవరోహించడముకద్దు. అంత మాత్రాన వివశుడై, చలించి, కార్యసాధనదీక్షను సడలనివ్వడు. అదే వాని ప్రయత్న సఫలత.

ప్రకృతి సౌందర్యోపాసకులగు మేధావులు కొన్నివేల సంవత్సరాలనుండి నక్షత్రాలను పరిశోధిస్తున్నారు. వాటినిగూర్చి బహుళంగా విశేషాలు గ్రహించేరు. అందులో కొన్ని జట్టుజట్టులుగా, యాత్రిక సమూహాలవలె, ఆకాశ సంచారంచేస్తున్నాయని, నియమితమార్గాలలో చరిస్తున్నాయని కనుగొన్నారు. లెక్కకు సాధ్యంకానప్పటికి, నక్షత్రాలు అసంఖ్యాకంగా ఉన్నాయనిమాత్రం గుర్తించినట్లు లేదు. సామాన్యచక్షువులకు అగోచరమై యంత్రదృష్టికి గోచరించునక్షత్రాలు ఉంటాయని ఊహించినట్లయిన లేదు.

17వ శతాబ్దంలో గెలిలియో కనుగొన్న దూరదర్శినిమూలంగా మనకు దూరదృష్టి లభ్యమయిందనవచ్చును. ఆకాశ అంధకారాలలో వెలుగుచుక్కలు విశేషంగా గోచరమగుట ప్రారంభించేయి. దూరదర్శిని కేవలం ఒక జ్ఞానచక్షువుగా పరిణమించింది. మన దృక్పధంలో విశేషదూరంగానున్న నక్షత్రాలను చెంతకు తీసికొనివచ్చినట్లు చూపించింది. చూడకలిగినకొద్దీ ఆకాశం దీర్ఘ తరంకాగలదనీ, నక్షత్ర సంఖ్య అనంతం కాగలదనీ ఎరిగించింది.

నిశ్చయంగా ఈవిషయం మనకూహాతీతం.