2
జగత్తు - జీవము
తెలిసికొంటారు. ఈరెండు తెగలకు చెందని సామాన్యులు విశ్వం అంటే మనభూమి, మనం, మనసముద్రాలు, నదులు, అరణ్యాలు. పల్లెలు, పట్టణాలు, మేడలు, కోటలుకన్న అధికంలేదని అనుకొంటారు. అజ్ఞానంచేత, జడత్వంచేత, లోకజ్ఞానం సంపాదించు కుతూహలం లేకపోవుటచేత వారినమ్మకాలనే వేదంగా పరిగణించి సంతృప్తులౌతారు.
అంతేనా, లేక, కొంత నిశ్చయభావంతో సహేతుకంగా, సప్రమాణంగా, ఈవిశ్వమంటే ఏమిటో, దానివ్యాప్తి ఎంతవరకో. దానినిర్మాణమెట్టిదో తెలిసికొనడానికి అవకాశమున్నదా ? అని ప్రశ్న. విశ్వమేది ?
ఏరూపంలో ద్రవ్యమున్నా అదంతా విశ్వంలోనిదే. శక్తి యావత్తు విశ్వంలోనిదే. విశ్వాన్ని దాటి స్వతంత్రంగా పైనున్న దేమీ లేదు. మనకు కనిపించు నక్షత్రాలన్నీ విశ్వంలోనివే. అగోచరంగా ఉన్న నక్షత్రాలుకూడ విశ్వంలోనివే. విశ్వపర్యంతాలు కనుగొందా మంటే నక్షత్రాలు ఎంతవరకున్నాయో గమనించాలి.
నక్షత్రాల వై చిత్ర్యమేమంటే వాటికి అంతమున్నదని నిశ్చయింపలేకున్నాము. కంటికి సామాన్యంగా కొన్నివేల నక్షత్రాలు గోచరిస్తాయి. దూరదర్శిని (Telescope)తో ఆకాశం శోధిస్తే ఇంకా బహుళంగా కనిపిస్తాయి. యంత్రంయొక్క దృష్టి సామర్ధ్యం ప్రబలుతున్నకొద్దీ మనకు గోచరించు నక్షత్రాలసంఖ్య పెరుగుతునే ఉంటుంది. ఆకాశగర్భకుహరాలలో దాగి ఎందున్నవో కాని మానవుని పరిశోధనాశక్తిని ధిక్కరిస్తూ తండోపతండాలుగా నక్షత్రాలు బయల్పడుతున్నాయి. దీనికీ అంతులేదు.