పుట:Jagattu-Jiivamu.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జగత్తు - జీవము

1. జగత్తు

చీకట్లను వెన్నాడుచున్నట్లు నక్షత్రాలొక్కొక్కటే సూర్యస్తమయంతో బయటపడగా నవరత్నఖచిత వితానంవలె చీకటిరాత్రులలో ఆకాశం కనిపిస్తుంది. వెలుగుచుక్క లట్లు కనిపించునక్షత్రాల కాంతి కోటానకోట్ల మైళ్లదూరమునుండి కోటానకోట్ల సంవత్సరాలతరబడి ప్రయాణంచేస్తూ దిశలు వ్యాపిస్తూంది. దూరానికి విరామం లేదు; కాంతికి విశ్రాంతిలేదు. నక్షత్రాలనడుమనున్న దూరం క్షణక్షణం పెరిగిపోతూంది ; నియతవేగంతో అనుక్షణం కాంతి ఆకాశయానం చేస్తూనే ఉంది. వీటికి హద్దున్నదా ?

జగత్తుకి హద్దులున్నవా ? విశ్వంయొక్క వ్యాప్తిఎంత ?

విశ్వం అనుపదం మనకెంతపరిచితమో దానిభావం మనకంత దురవగాహం. ఆస్తికులు, మతగ్రంధాలు చదివినవారు, చతుర్ద శభువనాలని, నరకనాకలోకాలని, యక్షగంధర్వ కిన్నరాది ఉత్తమ జీవులని, ఇంద్రాగ్ని వరుణాదిదేవతలని, సప్తసముద్రాలని, మింట మెరుస్తూ నక్షత్రప్రాయంగానున్న మహాఋషీశ్వరులని మొదలగు లోకాలు, జీవులు, దేవతలు ఈభూమికన్న అన్యమైనవి విశ్వంలో నున్నట్లు గ్రహిస్తారు.నమ్మినవారు నమ్ముతారు. లేనివారులేదు. ప్రత్యక్షాలోకాన మహాభాగ్యంచేతనో, విజ్ఞానగ్రంధపఠనంచేతనో విజ్ఞానులు విజ్ఞానోత్సాహపరులు భూమిని తృణీకరించే మహాద్భుత పరిమాణంగల అపరిమితమైనగోళాలు అనంతాకాశంలో నిస్సహాయంగా అదృశ్యశక్తుల బంధనాలచేత అత్యంత దూరాలలో నున్నాయని