పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అటుపిమ్మట గణపతిమునియందు రేణుక యను నామాంతరముగల ఇంద్రాణి ప్రత్యేక కృప జూపజొచ్చెను. వైదిక దేవతయైన యీమె కృపవలన వేదహృదయ భేదజ్ఞానము, శ్రీరమణుని యుపదేశమునకు కవచమగు నొక వేదమంత్ర దర్శనము, తపఃపరిపాకమందు క్రమముగా కపాలభేదనమను సిద్ధిచే నమృత ప్రాప్తిని గణపతిముని పొంది, ఋగ్వేదఋషివలెబ్రగాశింప జొచ్చెను. అట్టి యపూర్వ కటాక్షమును బరపిన ఇంద్రాణి నుద్దేశించి 1923 సం||లో కపాలభేదనమైన పిదప రచింపబడిన స్తోత్రకావ్యమే యీ 'ఇంద్రాణీ సప్తశతీ'. దీనికి ఫలముగా మనదేశమందప్పుడు పాలించుచున్న పరదేశ ప్రభుత్వమునుండి విముక్తిని, దేశస్థులందు వేదమతదృష్టి నిచ్చి వారియందు వీర్య తేజోభి వృద్ధిని యర్ధించెను. ఉమా సహస్ర పారాయణమువలన తపఃప్రబోధమగుటకు సంకల్పించినట్లే కవి దీని పారాయణమువలన నంతర్బాహ్య శత్రువర్గ నాశనమును సంకల్పించెను.

ఉమాసహస్రములో వలెనే దీనియందును 25 శ్లోకముల నొక్కొక్క స్తబకముగా కూర్చి, యొక్కొక్క స్తబకము నొక్కొక్క ఛందస్సుతో రచించెను. మఱియు, నొక్కొక్క శతకమున కొక్కొక్క వైదిక ఛందోనామమిడి, కవి వైదిక దేవతను సార్థకము చేసెను. అది గ్రీష్మఋతువైనను ప్రతి దినము రచనాంతమందా దేవత మెఱుపుల నాకసమందు గల్పించి తన సంతోషమును జూపెను.

అట్టి యీ పవిత్ర గ్రంథమును ప్రచురించు భాగ్యము నాకు చేకూరినందుల కింద్రాణిదేవతకు, నామెకు పుత్రులైన శ్రీ రమణ గణపతులకు నే నెంతయు కృతజ్ఞుడను.