పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్రవించుట కప్పటికి నిర్ణయమయ్యెను కాబోలు ! అది కావ్యకంఠుని పై నేకాక ఆ క్షేత్రమున పండ్రెండు సంవత్సరములనుండి నిరంతర తపోమగ్నుడైయున్న నొక బ్రాహ్మణస్వామిపై కూడ స్రవించెను. ఆ కృప చొప్పున బ్రాహ్మణస్వామి నాశ్రయించి శంక దీర్చుకొనుటకు కావ్యకంఠు డొకవంక ప్రేరేపితుడై, యింకొకవంక చిరకాల మంతర్దృష్టి యందున్న కారణమున వాగ్రస ప్రవాహములేక శుష్కించిన కంఠ నాళములచే బద్ధకంఠుడైన బ్రాహ్మణస్వామి ముక్తకంఠుడై తన కనుభవ సిద్ధమైన నూత్న మార్గముచే తపస్స్వరూపము నుపదేశించుటకు ప్రేరేపితుడయ్యెను.

ఉపనిషత్తుల్యమైన యీ నవ్యోపదేశముచే కావ్యకంఠుడు కృతార్థుడై, తనకు ప్రాప్తించిన సిద్ధగురుని పూర్వాశ్రమ నామమును సంస్కరించి యతనికి భగవాన్ రమణమహర్షి యను పేరుంచి యంగీకరింప వేడెను. 'సరే నాయనా' యని పల్కి గురువంగీకరించుట బట్టి 'నాయన' యను క్లుప్తనామము గణపతిమునికి ప్రసిద్ధమయ్యెను. అటు పిదప నీ యుపదేశ సందర్భములను సమకూర్చిన యుపనిషద్దేవతయగు 'ఉమ' నుద్దేశించి, 'ఉమా సహస్ర' మను స్తోత్రకావ్యమును పంచదశాక్షరీ మంత్రబద్ధముగా రచించి, దానియం దీ నవ్యోపదేశముచే కర్మ - భక్తి - యోగ - జ్ఞాన మార్గములు సంస్కరింపబడిన తీరును జూపెను. ఆ స్తోత్రఫలముగా తన దివ్యదృష్టిచే శ్రీ రమణునియందు గాంచబడిన కార్తికేయాంశను ప్రస్ఫుటము గావించి, దానిచే లోక మందిప్పుడు వక్రమైయున్న బుద్ధిని సంస్కరింప వేడెను. ఈ ఫలము వెంటనే సిద్ధించి, ఆఱు నక్షత్రరూపములుగా నొకా నొక దివ్య తేజస్సాకాసమునుండి వ్యక్తమై శ్రీరమణుని బొందుట కావ్యకంఠునితో పాటక్కడివారు పెక్కుమంది తిలకించి ధన్యులయిరి.