పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

227



10. ఓ త్రిలోకేశ్వరీ ! నీవు కోపమును విడిచి, యింద్రుని మోహ పరవశుని జేయుదృష్టితో పాపాత్ముడైన యీ జనుని (నన్ను) పాపియగు శత్రువునుండి రక్షింపుము. (కల్కి = కల్కము కలవాడు గనుక కల్క్యావతారస్మృతి.)


11. ఓ మనస్సా ! ప్రబలపాపభీతిని దొలగించు నింద్రాణిని నీయంత రంగమున నిశ్చలమైనట్టి, వినయముతో గూడినట్టి, యనన్యమై ప్రకాశించునట్టి బుద్ధితో స్మరించుచు రాత్రులు వెళ్ల బుచ్చుము.


12. గగనమందు సంచరించునది, యుద్ధమందు విహరించునది, పుణ్యమునుండి శత్రువుల మతిని భ్రమింపజేయునది, యింద్రుని శత్రువులైన హయుడు మొదలుగాగల రక్కసులను భేదించునది యగు భగవతి ప్రకాశించుగాక.


13. తెల్లని నవ్వుగలది, ఇంద్రునాకర్షించు విలాసముగలది, స్వర్గమం దింద్రాణీ రూపిణిగా నున్నది, ధవళాచలమందు గిరిజాంబగా నున్నది, శత్రువులను జయించి దేవతలను రక్షించినది యైన అంబికను నేను శరణుబొందుచున్నాను.


14. చరణములందు మాచే ధరింపబడినది, ఇంద్రునకు భార్యగా నున్నది, స్వర్గమం దింద్రాణియై యున్నది, ధవళాచలమందు పార్వతిగా నున్నది, యేనుగు గమనమువంటి గమనవిలాసము గలది యగు దేవివలన మేము ప్రకాశించుచుంటిమి.


15. ఓ శచీ ! యుద్ధమందు దేవేంద్రుని శత్రువధకొఱకు సమర్ధ భుజబలయుక్తునిగా జేసి, నీ వొకానొక పిఱికిదానివలె దుర్గము (కోట) నుండి యెచ్చటికిని వెడలవు.