పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 4.

ఇంద్రాణీ సప్తశతీ

211



1. సూర్యాగ్నులచే గాని, తటిత్తుచే గాని; చంద్రునిచేగాని జయింపబడజాలని నా హృదయ తమస్సు నింద్రాణీ హసితము తన నిర్మల కాంతిపుంజములచే హరించుగాక.

(మొదటినాల్గును బాహ్యతమస్సులనుమాత్రము జయించును.)

2. నమ్రుల కిష్టములేనిదానిని నశింపజేయు కరుణా సముద్రమగు దృష్టిగల యింద్రాణి యితర మతస్థులచే చీకాకు గావింపబడిన నా యీ జనినియగు భారతభూమిని రక్షించుగాక.


3. ఈ లోకములో కుమారునిచే ఛేదింపబడిన శిరస్సు గలది, శ్రేష్ఠబుద్ధి గలదియైన జమదగ్ని ముని భార్య నింద్రాణి యావేశించెను.


4. యదుకులమున కపకీర్తి వచ్చునను భీతిచే కవులు నిజమును గప్పిపుచ్చి, యీ మునిపత్ని యొక్క వధహేతు కథను వేఱు మార్గమున నసహ్యముగా జెప్పుచున్నారు.

(కార్తవీర్యుడు యదుకులమువాడు.)


5. ఆ కార్తవీర్యార్జునుడు భృగుకుల తిలకుని సురభి నపహరింప లేదు. అతని పత్నియు, చంద్రముఖియు, పాపరహితురాలునగు పరశురామ జననినే యపహరించెను.


6. ఆ జమదగ్ని సుతుడైన పరశురాము డతిరథుడైన అర్జున మహారాజును సేనా సమేతముగా యుద్ధమందు జయించి విశాల కీర్తిగలవాడై, తల్లిని తిరుగ తీసికొనివచ్చెను.