పుట:Himabindu by Adivi Bapiraju.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనదేశము పై విడియును. ధాన్యకటకము కృష్ణలో కలియవలెనా? ప్రతిష్ఠానము గౌతమిలో లీనమై పోవునా? కాకుళము సముద్ర తరంగములలో మాయమైపోవునా? ఆంధ్రరాజ్యలక్ష్మీ ఫాలమునుండి సౌశీల్యతిలకము మాసిపోవునా? లేక ఆంధ్రసైన్యములు మహారాజు స్వయముగా నడుపబోయి, విజయ యాత్రసలిపి విరోధుల నడంచి ఆంధ్రపౌరుష మెల్లయెడల చాటిరావలయునా? తెలియజేయుడు. ఇంకొకటి ఈ జైత్రయాత్ర కగు వ్యయము మహాభాగుడగు చారుగుప్తులవారు భరించెద మని వాగ్దానము చేసినారు.”

ఇటులనే సర్వసైన్యాధ్యక్షుడు ఉపన్యాసము సలిపెను. అనేకవేల జనులు ప్రోవైయున్న యా మహాసభ జయజయధ్వానములుసలుపుచు, మహారాజు ఈ జైత్రయాత్ర విషయమై ఏమి యొనరించినను వల్లెయని యొప్పుకొనిరి.

ఆంధ్ర సైన్యములు బయలుదేరినవి. శతాబ్దములనుండి ఆంధ్రవాహినులు భరతభూమిని ప్రసిద్ధిగాంచినవి. చంద్రగుప్తుని కాలమున ఆంధ్రులు సర్వస్వతంత్రత గలిగిన పరాక్రమపూరితములగు మహాసైన్యముల కలిగి యుండిరి. అశోకునికి మిత్రులైరి. అశోకునివెనుక భరతభూమిలో ఆంధ్ర సైన్యముల బలము వేరొక రాజ్యమునకు లేదు. రెండువేల ఏనుగులు, ఆరువేల అశ్విక సైన్యము, రెండువేల రథములు, రెండులక్షల పదాతిదళములు బయలుదేరినవి. ఎనిమిది వృషభములు, నాల్గువృషభములు పూన్చిన బండ్లు సామగ్రులను, సేవకులను, దాసదాసీ జనంబులను కొనిపోవు చుండెను.

ముందు అరువదివేల సైన్యములు బయలువెడలినవి. పదికోశముల తరువాత అరువదివేల సైన్యములు సాగినవి. అవన్నియు కృష్ణానది దాటి, వ్యాఘ్రదేశము కడచి, గోదావరికడకు పోవునప్పటికి తక్కిన ఎనిమిదివేల సైన్యములు పోయినవి. గోదావరికడ పడవలు వేలకువేలు సిద్ధముగానుండెను. రేవుస్థలములదాటి సైన్యములన్నియు ఆవలియొడ్డుకు బోయినవి. దక్షిణకోసలము గడచినది. కళింగము వెనుకబడినది. తెలివాహానది వారికి శీతలోదకములు ప్రసాదించినది. ఉప్పెనవలె, ఎడారులలో వీచు భయంకరమగు ఇసుకగాలులవలె ఆంధ్ర సైన్యములు కతిపయప్రయాణంబుల సాగిపోవుచునే యున్నవి.

4. చైతన్యోదయము

స్థౌలతిష్యుని మహావిద్యవల్ల ఆ బాలికలోని మానవత్వము నెమ్మది నెమ్మదిగ వెనుకకుపోయి పశువులలో ఉత్తమమైన గోవు స్థితికిపోయినది. ఆ వెనుక ఆమె ఏనుగుస్థితికి దిగినది. ఒక్కొక్కవర్షము గడచినకొలది ఆమె శునకజాతికి పోయినది. మార్జాలజాతికి దిగినది. శార్దూలమైనది. ఈ నాడామె భయంకరశార్దూలోరగము.

స్థాలతిష్యుని అఖండ ఆయుర్వేద పాండిత్యము అమృతబాల కావలసిన ఆమెను కాలకూటవిషసన్నిభను చేసినది.

గుజ్జనగూళ్ళలో నామెకు గరళము తిలబీజ దశభాగము నిచ్చువాడు. ఆమె పాలలో నాభి యవగింజలో త్రింశతి భాగము కలుపువాడు. చంద్ర బాలకు మూడవయేడు వచ్చునప్పటికి సౌరాష్ట్రకము తిలప్రమాణ మామె ఆరగింప గలిగినది. ఆమె కైదవయేడు వచ్చునప్పటికి శాక్లికేయము యవగింజ తినగలిగినది. దారదము, వత్సనాభము ఆమెకు

అడివి బాపిరాజు రచనలు - 2

• 89 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)