పుట:Himabindu by Adivi Bapiraju.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఫలహారములైనవి. చంద్రబాలకు పన్నెండవయేట తొమ్మిదిరోజులు జపతపాది హోమంబులు చేసి, స్థౌలతిష్యులు మహావిషమైన కాలకూటమును, దక్షిణ దండకాటవీ మహానాగ దంష్ట్రాంచిత కాకోలమును చంద్రబాలయందు ప్రవేశింప జేసినాడు. ఆ భయంకర ముహూర్తమునుండియు ఆమె విషకన్యకయైనది.

ఆనాటినుండియు ఆమె స్పర్శయే, ఆమె ఉచ్ఛ్వాసనిశ్వాసములే, ఆమె పరిసరమే దారుణమృత్యుస్వరూపమైపోయినది. ఆ ముహూర్తము నుండియు పెద్దపులులును ఆమెకడకు వచ్చుటకు భయపడును. ఆమెచేతిలో సాధారణ విషములు అమృత ప్రాయములు.

స్థౌలతిష్యునిశిష్యులు ప్రతినిమేష మా బాలకు క్రౌర్యము పాఠముగ జెప్పుచుండిరి. మృత్యురూపమగు లాలనజేయుట, కులుకులుసూపుట, దరికి జేరుట, నశింపజేయుట యివి అనుదినము నామె నేర్వవలసినదే. ఆమె వివిధ భాషలతో మాటలాడుటయందుత్తీర్ణురాలైనది. ఆమెకు చక్కని సంగీతము నేర్పబడినది.

ఎట్టి శ్రీశుకుడైనను ఆమెను దర్శించిన మాత్రమున, ఆమె హోయలు కనినంతమాత్రమున, ఆమె తీయనిపాట వినినంతమాత్రమున కరగి ముగ్ధుడయిపోయి ఆమె భయంకరాద్భుత సౌందర్యములో మగ్గి మసి యైపోవలసినదే.

మలయనాగుడు ఆమెకు ఆహుతియైన పిదప ఆ బాలయు తన నివాసము చేరినది. ఆమెకు నేదియో విషాదము, ఏదియో ఆవేదన. ఆమె హృదయాకాశమునందు కాలమేఘములు ఎచ్చటనో పొడసూపినవి. తన్ను తాతగారు ప్రయోగించిన దినమున విషకన్య తనచుట్టునున్న సభ్యులను జూచినప్పుడు వీరందరు నుసియగుదురో యను ఆలోచన పొడమినది.

చిన్న తనమునుండియు తనలాలనలచే మగ్గిపోయిన కురంగశాబక శవములను చూచి నవ్వునది. హస్తస్పర్శచే మాడిపోయిన మల్లికాది సుమములగని కిలకిలలాడునది. తనచుంబనములచే హతమారిన శుక శారి కాదుల చూచి గంతులువేయునది. మృత్యు వామెకు చెలియలు. అగ్ని యామెకు చుట్టము, కాళరాత్రి యామె అధిదేవత. అమావాస్య ఆ బాలిక ఆటలాడుకొను కాలము. అట్టహాస మామె విలాసము, భయంకర తాండవ మామె ప్రియనాట్యము.

మత్తిల్లిన పురుషు డుచితానుచితజ్ఞత కోలుపోయి, నిండుసభలో భయ మిసుమంతయులేక, ఆ సమయము పవిత్రము అను ఆలోచనయే లేక తన్ను కామించి తనకడకు పరువిడి వచ్చినాడు. మరుసటి నిమిషమున విగత జీవుడై పడిపోయినాడు.

ఈ సంఘటన ఏమియు నా విషబాల కర్థము కాలేదు. ఆమె కామమే ఎరుగనిది. ఆమె సంపూర్ణయౌవన. ఆమె దేహము, నరనరము, ఆమె వనితాత్వచిహ్నిత విచిత్రాంగములు విద్యుచ్ఛక్తిచే మేఘములు విలసిల్లినట్లు జ్వలించుట ప్రారంభించినవి.

స్త్రీ పురుషసంబంధ మన నేమో ఏమాత్ర మామే ఎరుగదు వానిని గూర్చి ఏరును చెప్పలేదు. వానినిగూర్చి యామె చదువనులేదు. పాములు, పిట్టలు సంగమించుట రెండు మూడు లామె చూచినది. ఆమె శిశు హృదయ మా విషయమై తాతగారి నడిగినది.

రెండు ప్రాణులు ఒకటికడ ఒకటి యుండుట కిష్టపడుననియు, అప్పుడవి చాలదగ్గరగ వచ్చుననియు, ఒక్కొకప్పుడా రెండు ప్రాణులు దేహము దేహముకూడ పెనవేసికొనిపోవుననియు, దానిని “ప్రేమ” యందురనియు స్థౌలతిష్యు డామెకు చెప్పినాడు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 90 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)