Jump to content

పుట:Himabindu by Adivi Bapiraju.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అశ్వసూతులు గుర్రమును బాగుగా తోమి కడిగి చందన మలందవలెను. రోజును రెండుసార్లు క్రొత్తపూలదండలు వేయవలెను. ప్రతి గుర్రమును గురించి భూతములకు ఫలాదు లర్పించవలెను. ఉత్తమ బ్రాహ్మణులు వచ్చి అశ్వినీదేవతలకు వేదమంత్రములు చదువవలయును.

ఆంధ్రపదాతిదళములు నాలురకము లున్నవి: ఎప్పుడును చక్రవర్తికడ జీతములు పుచ్చుకొనుచుండువారును, మాండలికాదిసామంతులకడ సర్వకాలము నుండవలసిన చమువులును, జైత్రయాత్రకై యితరదేశముల నుండి భత్యములకైవచ్చు దళములును, యుద్దకాలమునందుమాత్రమే చేరు సాధారణ ప్రజానీకము.

పదాతిదళములలో సైనికులు వారి ఆయుధములనుబట్టి నాలుగు తరగతులక్రింద విభజింపబడియుండిరి. విలుకాండ్రు, దుర్గభేదకులు, శూలికులు, యాంత్రికులు.

విలుకాండ్రకు శిరస్త్రాణము, వక్షఃకవచము, హస్తపాదఫలకములు నుండును. వారు నడుమున, కటిభాగమున, వీపున, శిరస్సున అంబులపొదులను కట్టుకొందురు. ప్రతి విలుకానికి నాలుగు ధనుర్దండములు, పదునారు వింటి తాడులును, ఎడమచేతికి అంగుష్ఠ రక్షలు నుండవలెను. వారి నడుమునకు రెండు చురకత్తియలును, ఆయుధములు కూడ ఉండవలెను. శూలికులకు ఒకశూలము, మూడు శూలముఖములు, ఫలకఖడ్గము, ఛురికయు ఉండవలెను.

యాంత్రికులు సర్వతో భద్రాదియంత్రములు ఉపయోగింతురు. వానిని రక్షింతురు. వానికి తగిన పరికరములన్నియు సేకరింతురు. వలయునెడల కత్తిపట్టి పోరాడగలరు. దుర్గభేదకులు దుర్గములకు సొరంగములుచేయుట, లగ్గలకు తాటినిచ్చెనలువేసి ఎగబ్రాకుట, కందకముల నీదుట, కందకములకు వంతెనలు కట్టుట, దుర్గభేదకయంత్రము లుపయోగించుట, దుర్గరక్షణ చేయుట-వీనిలో అత్యంతకౌశలము కలవారు.

మహారాజగు శ్రీముఖశాతవాహనుడు తాను జైత్రయాత్ర కరుగుటకు మహాసభను పిలిపించెను. వివిధ విషయములనుండి సభ్యులు విచ్చేసిరి. గ్రామాణులు, దళనాయకులు, శతనాయకులు, వివిధ సమితి సభాధ్యక్షులు, వివిధ శాఖాధ్యక్షులు, మంత్రులు, బౌద్ధభిక్షుకులు, భిక్షిణులు, పండితులు, వణిక్సమూహాధిపతులు, వివిధశ్రేణి సంఘాధ్యక్షులు, చిత్రకారకులు, శిల్పులు ఆ మహాసభలో సభ్యులు. అందరకు రాజాజ్ఞలు అందగనే అధిపతి సలుపబోవు నుత్కృష్టకార్యమునకు అనుమతి నీయుటకుగాని, వీలు లేదని త్రోసిపుచ్చుటకు గాని విచ్చేసిరి.

విశాల మగు సభాభవనమున మహారాజు సింహాసనాసీనుడై యుండెను. సభికులు కొలువుదీరి యుండిరి. ప్రధానామాత్యుడగు అచీర్ణుడులేచి సభ్యుల దిక్కుమొగంబై ఈ విధమున నుడివెను: “మహాసభ్యులారా! మాళవాధిపతి మనరాజ్యమునుండి విడివడి, మహారాజుపై యుద్ధము ప్రకటించి, యుజ్జయినీకోటలో వినీతమతిని ముట్టడించినాడు. మాళవునికి సహాయముగా భోజులు, పుళిందులు, వైదేహులు, మాగధులు వచ్చి చేరినారట. ఆంధ్ర రాజ్యము గొడ్డుపోయినదా? గౌతమీ కృష్ణవేణి పవిత్రాంబువులు మీ రక్తాల ప్రవహించుట లేదా? ప్రియదర్శి యగు నశోకచక్రవర్తికి లోబడక సమముగా రాయబారముల నడిపి స్వతంత్రపూరితమై ఒరులకు తల యొగ్గక విశాలమై ఆంధ్రపతాక మగు సింహధ్వజభీషణారాహంబుల దశదిశల పర్వజేయు మనదేశము నేడు మాళవునిచే పరాభవింపబడవలెనా? ఉజ్జయినిలో మాళవుడు విజయ మందును. ఆ సైన్యముతో

అడివి బాపిరాజు రచనలు - 2

• 88 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)