పుట:Himabindu by Adivi Bapiraju.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరిగి బాలికలు సిద్ధార్థినికతోకూడి తోటలోనున్న శిల్పమందిరమునకు జనిరి. అచ్చటి మహా శిల్పభవనములు విశ్వబ్రహ్మలోకములే! ఆ మందిరముల ఎన్ని సభాభవనములున్నవో వారు విభ్రమమంది గమనించ లేకపోయినారు.

ఆ విశాల శిల్పశాలలలో స్తంభములు గుండ్రముగ నునుపులైన పద్మశిరోపరి భాగముల పటములను మోయుచున్నవి. స్తంభములపై, పటములపై, చిత్రికలపై చిత్రలేఖనములు సహస్రమూర్తియుతములై, వివిధ వర్ణికాభంగసమ్మోహనములై, లలితాంగహారాంకితములై, సకలచిత్రలేఖన కళాలంకారశిల్పరూప మృగ్రపక్షితరులతా పుష్పసమన్వితములై, రసజ్ఞుల వివశులచేయుచున్నవి.

ఆ మందిరముల ఎందరో విద్యార్థులు పనిచేయుచున్నారు. చిత్రములు లిఖించుచున్నారు. రాళ్ళు సరిచూచుచున్నారు. శిల్పకర్మకు ఉచితములైన శిలల శాస్త్రవిధానమున సరిచూచుచున్నారు, చెక్కుచున్నారు. కొలతలు చూచుచున్నారు. నునుపు చేసిన రాలపై చెక్కుటకు బొగ్గుచే రూప విన్యాసము చేయుచున్నారు.

ధర్మనందులవారు కొందరి శిల్పముల సరిచూచుచున్నారు. సరియైన రాల నేరి పరీక్షించుచున్నారు. విన్యాసములు సరియై యున్నదియు లేనిదియు కనుగొనుచున్నారు. కొందరికి శాస్త్రమునుండి సూత్రముల వివరించి, ఇది యిట్లు, అది అట్లు అని చెప్పుచున్నారు.

అతిథులై వచ్చిన యా ఉత్తమాంగనల తనభార్య కొనిరా ధర్మనందియు, బాలకులు లేచి నిలుచుండి వారికి గౌరవమొనర్చిరి.

ఆ బాలకులందరు హిమబిందు అందము చూచి, పనిమాని గురువుగారు చెంతనున్న మాటయే తలపక తదేకదీక్షతో నామెవంక చూడసాగినారు. ఈ దృశ్యము చూచి ధర్మనందియు నాశ్చర్యమందెను.

హిమబిందు తనముత్తవ మేనత్తలతో బాటా శిల్పపుంబనుల గమనించి యాశ్చర్యమందినది. లోన ఉబుకు ఆరాటమునకు కారకుడైన విజయి యగు నా బాలశిల్పి యేడి యని యాశ్చర్య మందినది. సిద్ధార్థినిక ఆ బాలికతో నడుచుచు తనతోటలో నున్నాడని చెప్పినది.

వారంద రా మందిరములలోని అనేక స్థితులలో నున్న శిల్పము, చిత్రలేఖనము లన్నియు తోటలో పరిశీలించినారు. ఆ మందిరములనుంచి వినిర్గమించి వేరొకచోట నున్న సువర్ణశ్రీ శిల్పమందిరములు చూడ బోయిరి.

అచ్చట హిమబిందునకు పరవశత్వమే కలిగినది. ఏమి ఈతని పనితనము! అవి అతని శిల్పములా, అవి చిత్రలేఖనములా!

అదేమిటి! ఆ గోడపై త్రిభంగిగా నిలుచుండిన బాలికామూర్తి ఎవరు? తానే! తా నేల? ఓహో! అందరును ఆ బొమ్మను గుర్తించిరి. హిమబిందును చిత్రలేఖనముగా రచించుట సువర్ణశ్రీ కేమి యవసరము? అని ముత్తవ ముక్తావళి అనుకొన్నది. ఎంత అందముగా నున్నదా బొమ్మ! అచ్చముగ హిమబిందు. ఆమెను అచ్చట నొక దేవీమూర్తివలె రచించినా డీ బాలుడు.

అమృతలతాదేవికి తన మేనకోడలిని ఈ బాలకుడిట్లు లిఖించుట ఇష్టము లేకపోయినది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 81 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)