పుట:Himabindu by Adivi Bapiraju.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనునవి నచ్చలేదన్నది. మిలమిలలాడు మడతల కులుకులీను అంబరములు గని పెదవి విరచినది. ఎట్టకేల కామె బంగారువన్నె ఆంతరీయము ధరించినది. వివిధవర్ణ సురేంద్రచాప సౌందర్యముగ సుచేలకము కటిభాగ మలంకరించినది. రత్నతారకలు పొలుపారు సువర్ణమేఖల నొయారంబుగ నెన్నడుము క్రింద మొలనూలు తాల్చినది. వక్షోపరిసానువుల మేఘ మాక్రమించునట్లు ఆచ్ఛాదనోత్తరీయము నీలరుచుల వెలుగుగా సొబగుచేసినది. తుల్యరహిత హారపంక్తులు ఎత్తుపల్లముల ప్రవాహములుగా రచించినది. చంద్రబింబముపై రోహిణివలె రోహితలలాటికము తాల్చినది. వేణీభరమును ఆంధ్ర స్త్రీ లెప్పుడు నూహింపజాలని విధమున రచింపించుకొన్నది. వేణీరచయితలు మార్జనికలు, అలంకారికలు ఆమె యలంకారమగునప్పటికి నలిగిపోయినారు.

హిమబిందు ఠీవితో నొరులకడ గంభీరతవహించి సంచరించినను, చనవున్న వారికడ లో నడంగియున్న బాలికానందము మఱుగపరచలేదు. చంటి పిల్లవలె గంతులు వేయును, కలకల నవ్వును, ఆటలాడును. చిరు గాలులవలె సంతోషముమై సంచరించును, నెచ్చెలులతో హాస్యమాడును. చిన్నతనమునుండియు పిల్లలులేని చారుగుప్తుని కొమారిత బాలునివలె పెరిగినది. బాలికా విద్యతోపాటు బాలుర విద్యలును నేర్చినది.

నాల్గు ఉత్తమాశ్వములు పూన్చినరథము తెల్లకంబళి ఛత్రముగా గప్పబడినది. చిత్రశిల్ప కౌశల్యము కలిగి మెరుగులీనునది, ధర్మనంది మహాభవనముకడ ఆ సాయంకాలము పదమూడవ మూహూర్తనాదము పట్టణములో ననేక ప్రదేశముల ప్రతిధ్వనించునప్పటికి వచ్చి యాగెను. అందు స్త్రీ జనముండిరని తెలియుట తోడనే లోనుంచి పరిచారికలు వచ్చి వారి నెదుర్కొనిరి. తోరణముకడ మహాలియు, శక్తిమతియు ఎవరు? వీరా! యని యాశ్చర్యమందుచు ఎదుర్కొని తెలిసికొనిరి. సేవకురాండ్రు రజత పాత్రంబుల సుగంధజలంబుల నర్పించ కాళ్ళుగడిగికొని లోనికిపోయిరి. పరిచారికలు శుభ్రవసనముల వారిపదము లద్దిరి.

వారందరు అభ్యంతరమందిరములకు పోయిరి. అచ్చట సుఖాసీనయై వివిధవార్తల ముచ్చటించుకొనిరి. కొమార్తెను తలంచుకొని ముక్తావళీ వాపోయెను. అందరును కండ్లనీరు పెట్టుకొనిరి. ముక్తావళీదేవి శక్తిమతిని పిల్లలెంతమందియని యడిగెను. ఏమి చేయుచున్నారనెను. వారిరువురు యెరిగియున్న కాంతలగూర్చి మాట్లాడిరి. ఈలోన సిద్ధార్థినిక వీరువచ్చిరని అక్కతో అన్నతో చెప్పుటకుపోయినది. నాగబంధునిక సత్వరము వచ్చి హిమబిందును కలసికొన్నది. హిమబిందును నాగబంధునికయు నెయ్యముతో ముచ్చటించుకొనిరి, నవ్వుకొనిరి. నాగబంధునికకు హిమబిందు నే డేల యింత విచిత్రముగ, యింత సౌహార్ధముగ తమయింటికి వచ్చి తనతో మాట్లాడుచున్నదో అర్థమైనది.

అందరును ఇల్లు చూచుటకు బయలువెడలిరి. వైభవమునకు, వైశాల్యమునకు, ఔన్నత్యమునకు చారుగుప్తుని మహాభవనముతో ధర్మనంది సౌధము సరిపోకపోయినను సౌందర్యమునకు దానితో నేమాత్రము తీసిపోదు సరిగదా మించియుండును. హిమబిందు కళానిధి యగుట నా మందిరములు చూచి ఆనందించెను. ముక్తావళీదేవియు, అమృతయు, శక్తిమతియు వెనుకబడుటచే నాగబంధునికయు, హిమబిందు ముందుబోయిరి. హాస్యములాడుచు కెవ్వున నవ్వుకొనిరి. చప్పట్లు కొట్టుకొనిరి. అట్లా మందిరము లన్నియు

అడివి బాపిరాజు రచనలు - 2

. 80.

హిమబిందు (చారిత్రాత్మక నవల)