పుట:Himabindu by Adivi Bapiraju.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమబిందు పొందిన ఆశ్చర్యమునకు మేరయేలేదు. ఎందు కీ బాలుడు తన చిత్రము లిఖించినాడు? ఎంత పనితనము! ఏమి యా చిత్ర చమత్కృతి! ఆ వస్త్రాదికములు, ఆ నగలు పందెముదినమున నాట్యసమయమున తాను ధరించినవే.

ఆమె హృదయము రాగములు పాడినది. అమృతలత అందరిని ఆలస్యమైనదని కేకలువేయుచు త్వరితముగ బయటకి కొనివచ్చినది. హిమబిందున కెంతమాత్ర మట్లు పోవుటకు ఇష్టములేదు.

సువర్ణశ్రీ యెచ్చటను కనబడడేమి? దాగుకొనినాడా ఊర లేడా? ఎక్కడికైన ప్రయాణమై పోయినాడా? ఆమెకు ఆరాటము ఇనుమడించినది. ఒక అదనున ఆమె సిద్ధార్థినికను “మీ అన్న యేడి?” యని చెవిలో రహస్యమున నడిగినది. సిద్ధార్థినిక పరుగెత్తిపోయి హిమబిందును, ఆమె చుట్టములును, వచ్చినారని అక్కతో చెప్పుటకు వేగమున వెళ్ళినప్పుడు కృష్ణాతీరమున వారిరువు రుండుట చూచి యక్కడకు బోయి యక్కతో చెప్పి పంపించి మరల తాను వచ్చినది. అన్న అక్కడ యుండు ననుకొని ఇప్పుడు నామె యచ్చటకు బోయినది. అత డక్కడ లేడు.

తోటయంతయు వెదకినది. తోటమాలీల నడిగినది. వారిచే వెదకించినది. తన భవనముల వెదకినది. సేవకులచే వెదకించినది. సువర్ణశ్రీ ఎచ్చటను లేడు. ఏమైపోయినాడు?

ఆమెవచ్చి హిమబిందు చెవిలో అన్న ఎచ్చటకో పోయినాడని చెప్పినది. హిమబిందునకు ఆశ్చర్యము, కోపము, విసుగు, విచారము వచ్చినవి.

ఇంక నామె కేమియు తోచలేదు. తొందర తొందరగ అన్నియు చూచుట ముగించి “వెళ్ళెద” నని శక్తిమతితో నామె యనినది.

నాగబంధునికయు, శక్తిమతియు వారిని ఇంకను ఉండుడని కోరిరి. ముక్తావళీదేవి శక్తిమతితో నింతవరకు తనతనయను గూర్చి ఎన్నియో చెప్పి వాపోయినది. ఆమె కన్నుల అశ్రుధారలు ప్రవాహములై పోయినవి. శక్తిమతియు దన స్నేహితురాలి సుగుణముల వేనోళ్ళ పొగడుచు కన్నుల నీరునిండ విచారించినది. అందరికిని అశ్రుధారలు వాకలైనవి.

అమృతలతాదేవి వేగిరముచేయ వారు మువ్వురును బాలనాగియు బయలుదేరిరి.

కస్తూరిచే సమ్మిళితమగు కుంకుమబొట్టు శక్తిమతీదేవి ముక్తావళీ దేవికిని, హిమబిందునకును మోమున నుంచినది. నాగబంధునిక వారి పాదములకు లత్తుక నలదినది.

పద్మరాగమున నెఱ్ఱవారి, చిరుతామర మొగ్గలరీతి మంజులములై ఆర్ధ్రములై నవకంబులీను వేళ్ళతో, ముక్తావళి హిమబిందుల ఇరువురి పాదంబులు తన చేతికాంతులతో వియ్యమొందునప్పుడు నాగబంధునిక ఆపాదద్వితీయ సౌందర్యమునకు నాశ్చర్య మందినది. హిమబిందు పాదములు తన యన్నగారి శిరస్సును, సత్యాదేవి పాదములు శ్రీకృష్ణుని శిరస్సునువలె తాడన మొనర్ప తగునని యామె యాలోచనల మునింగినది.

గంధ మలంది, సువాసనద్రవ్యము లర్పించి, చూతఫలములు, నారంగములు, ఖర్జూరములు, దాడిమాదిఫలములు, బాదమిపప్పు, చారపప్పు మొదలయిన పప్పులు; లవంగ, దాల్చిన, ఏలకీ, జాజి, జాపత్రి మొదలయిన సువాసనద్రవ్యములు, సుందర వస్త్రములు ముక్తావళీ హిమబిందులకు శక్తిమతీదేవి యర్పించినది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 82 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)