పుట:Himabindu by Adivi Bapiraju.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనుచుండిరి. వస్తువులు వర్తకమునకై మార్చుకొనుట, వస్తువులు పణమునిచ్చి కొనుట, మూల్యమునకై అమ్ముట క్రయవిక్రయ మందురు. వ్యవహారమును పణమందురు. ఎగుమతి దిగుమతులు మొదలైనవన్నియు వ్యవహారమే. అమ్మకమునకు, కొనుటకు గల వస్తువులన్నియు పణ్యములు. వస్తువులు వర్తకమునకై అమ్మువారు, కొనువారు వణిజులులేక వణిక్కులు. ఈ వ్యవహారములుసల్పు వారిలోకుల, మత, జాతి బేధములన్నియు నున్నవి. కాని భారతదేశమునందు యీ వ్యవహారము చేయువారు ముఖ్యముగ వైశ్యులు. వీరిలో వ్యవహారము చేయువారు వ్యావహారికులనియు, పాశుపాల్యులనియు, క్షేత్రసంస్కారు లనియు మూడువృత్తు లవలంబించు వైశ్యులున్నారు.

వ్యవహారము సలుపువారలలో క్రయవిక్రయులు వస్తువిక్రయ శాలలు పెట్టుకొను వారు వశ్నికులు వడ్డివ్యాపారస్థులును, పెట్టుబడిదారులును. సంస్థానికులు యితర దేశములతో నెగుమతి దిగుమతి లొనర్చువారు. వీరినే సార్థవాహులు, సార్థకులు అనియు పిలుతురు. ఈ వణిక్కులలో ప్రభువులపక్షమున గనులు త్రవ్వించువారును, ఆటవిక వస్తువులను సేకరించువారుగ రెండువిధములవారున్నారు.

నిమి యను రాజు వర్తకశాస్త్రమును రచించినాడట. ఆ శాస్త్రమును చదివి వర్తకులు వైదేహులను పేరును సముపార్జించుకొనిరి. వర్తకులకు వర్తక సంఘములున్నవి. వానిని సంస్థానములందురు. సంస్థానికము లనియు పేరు గలదు.

కీర్తిగుప్తుడనేక జనపదములందున్న సంస్థానములలో సభ్యుడు. కొన్నింటికి అధ్యక్షుడు.

ఆంధ్ర వర్తకులలో కాశ్మీరముతో వర్తకము చేయువారు కాశ్మీర వణిజులు, గాంధారముతో చేయువారు గాంధారవణిజులు. కీర్తిగుప్తుడు నానా దేశవణిజు డని పేరుపొందినాడు. అతనికడ కౌశికులు, మాద్రులు, కాశ్మీరులు, గాంధారులు, మాళవికులు మొదలైన వర్తకులు ఎందరో యుండిరి.

కీర్తిగుప్తుడు గాంధారమునుండి ఔత్తరపథమున పారశీక, బాహ్లిక, తురుష్క వనాయు, కాంభోజ, కశ్యపసముద్ర, యవన దేశములతో వర్తకము చేయుచుండెను. అతనికి సర్వభాషలు గళగ్రాహములు. అన్ని దేశములవారాతని తమ దేశపువా డనియే భ్రమించియుండిరి.

ఈనాడు కీర్తిగుప్తులవారికి డెబ్బది రెండు సంవత్సరములున్నవి. ఆయనకు ఆంధ్రదేశములో వివిధప్రదేశముల ఉద్యానవనములు, ఫలవనములు లెక్కలేనన్ని యున్నవి. ఆర్యావర్తమునందు, దక్షిణాపథ మందు ప్రతిముఖ్యనగరమునందును కీర్తిగుప్తునకు వణిక్శాలలు, భవనములు ఉన్నవి.

కీర్తిగుప్తుడు ముప్పది సంవత్సరముల ఈడువాడై యున్నప్పుడు ప్రయాణము లొనరించి తక్షశిలానగరముచేరి తనభవనమునకు బోయెను. కీర్తిగుప్తుడు ప్రసిద్ధవర్తకు డగుటచే నాతనిరాక వచ్చిన మరుఘటిక యందే వర్తక లోకమున కంతయు దెలిసిపోయెను. నాలుగు గుఱ్ఱములు పూన్చిన రథము నెక్కి రాత్రి మొదటి యామములోనే స్నేహితుడగు డెమిత్రియసు అతితొందరగ పరువిడి వచ్చినాడు. వారిరువురు ఒకరి నొకరు కౌగిలించు కొనినారు.

డెమిత్రియసు వెంటనే కీర్తిగుపుని యాతనిభవనములో భోజనము చేయనీయక తన ఇంటికే కొనిపోయెను. ఆ యవనవర్తకుని భవనము భారతీయ భవనములరీతిగా

అడివి బాపిరాజు రచనలు - 2

• 73 •

హిమబిందు(చారిత్రాత్మక నవల)