పుట:Himabindu by Adivi Bapiraju.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నుండలేదు. ఆ భవన మొక అద్భుత వనాంతరమున నున్నది. ఆ వనమందు అపఫల, అలివ, యవననారంగ, అంజీర ఖర్జూర, దాడిమ, ద్రాక్ష, బాదమాది యవన ఫల వృక్షములు; లికుచ, రసాల, జంబు, పనస, ఐరావత, బదరీ. రాజాదన, బిల్వ, రంభాది భారతీయ ఫలవృక్షములు, నున్నవి. కరవీరాది అనేక పుష్పజాతు లున్నవి. వన మంతయు కేళాకూళులు. వాని మధ్య వేదికలపై పాలరాతి యవన దేవతా విగ్రహములు కలవు.

ఆ విశాలభవనమున అనేకమందిరములున్నవి. మద్యశాలలో శృంగార సరస్సులున్నవి. అపొలో యను సూర్యదేవుడు, అర్టెకమిస్ అను చంద్రదేవత, అప్రొదితీ గ్రీకు శృంగార రసాధి దేవత, జ్యూసు, జూనో ముఖ్య దేవదంపతులు, విజ్ఞానదేవి యగు ఎధీనీ, కామసుఖదేవు డగు బాఖస్, లోకవార్తాహరుడు హెర్మిస్, దేవకన్యలు మొదలగు పాలరాతివిగ్రహములు, యవన కలశములు అందందు అలంకరించబడి యుండెను. ధూపకరండములనుండి సువాసనధూపము లెగయుచుండెను.

ఇరువురు మెత్తని పరుపులపై సుఖోపవిష్టులైరి. పారశీక సేవకులు జలకలశముల హస్తప్రక్షాళన జలప్రతి గ్రాహకములు తెచ్చుటయు, వారిరువురు హస్తముల కడుగుకొనిరి. కొందరు బాహ్లికసేవకులు రెండు భోజన పీఠముల గొనివచ్చి వారిరువురి ఎదుట నుంచిరి.

భారతీయేతరమగు మ్లేచ్ఛదేశముల బానిసత్వ మప్పుడు విరివిగ నున్నది. కొందరు బానిసబాలికలు సౌందర్యదీప్తలగువారు వచ్చి, గ్రీకు వాద్యములపై వాయించుచు. యవన, బాహ్లిక, హీబ్రు, పారశీకాది భాషలలో పాటలు పాడుచు నాట్యమొనరింప నారంభించిరి. భారతీయ నాట్యమునకు నా నాట్యములకు ఎంతయో భేదముండెను. కీర్తిగుప్తున కివియన్నియు గ్రొత్తవి కావు.

అప్పుడు బానిసలగు న్యూబియాబాలికలు మోయు ఆందోళికపై యూద బాలికలు వింజామరలు వీవ, పారశీక బాహ్లికసుందరులు గొడుగులు తాల్ప, అత్యంత సుందరి యగు నొకజవ్వని వీరిరువురునున్న కడకు వచ్చెను. బానిసలగు సేవకులు కొందరు దంతసింహాసన మచ్చట నుంచిరి. అందలము దిగి ఇరువది వరముల ఎలప్రాయంపు నా మిసిమి మిఠారి వొయ్యారముగ నడచివచ్చుచు నా సింహాసనముపై నథివసించెను.

డెమిత్రియసు కీర్తిగుప్తునిచేయి పట్టుకొని యామెకడకు గొనిపోయి ఎరుక పరచెను. ఈమె “పెర్లా” నా చెల్లెలు, ఈతడు “కీర్తిగుప్తుడు” నా స్నేహితుడు అని ఒకరికొకరి నెరుకపరచెను.

అది మొదలు కీర్తిగుప్తుడు “పెర్లా” (ముత్యము) దేవికి తన హృదయము, తన సర్వస్వము ధారపోసెను. పెర్లా కాతడు ముక్తావళీదేవి యని నామముంచుకొనెను.

రెండు మూడు నెలలలో వారిరువురికి వివాహము జరిగెను. ఆ దంపతుల జీవితము సకలానందపూరితమై మహారాగమైనది. కతిపయ మాసములలో వారు ఆంధ్ర దేశము తరలివచ్చిరి. ముక్తావళిగర్భమున ప్రజాపతిమిత్ర ఉద్భవించెను. ప్రజాపతిమిత్ర యవన భారతీయ సౌందర్యములను, సుగుణములను రెంటిని తనలో సంగమ మొనరించుకొనినది. ఆమె చిన్నతనమునుండియు ఏలోకమునుండియో వచ్చినట్లు తనలోనే తానై, ఇతరులతో కొలది సంభాషణమే జరుపుచు తా నొక్కరితయు ఆడుకొను చుండెదిది.

“వెఱ్ఱిది, విచిత్రమైనది” అను మాటలు చుట్టములు, పక్కములును, “ఏప్పటిపిల్లనో కొనివచ్చి చేసికొనిన వెర్రి సంతానము పుట్టదటమ్మా!” యని కీర్తిగుప్తుని అక్క చెల్లెండ్రును అనువారు.

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
.74.