పుట:Himabindu by Adivi Bapiraju.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగబంధునికవచ్చి “అన్నా, యింత యాలస్యము చేసినావేమి, ఎచటకు పోయితివి? అట్లు మాయమై పోయినావు! నీ శిల్పగృహమునకు వారందరు వచ్చిరి. నీవు లేవైతివి. నీ కొరకు తోట యంతయు, దొడ్డియంతయు చెల్లి వెదకినది. నీవు అదృశ్యుడవైతివి. పాపము, నా స్నేహితురాలు కొంచెము భిన్న మైనదిసుమా! పలాయనమంత్రపారాయణ కథానాయకుడ వైతివేమి!” అని మేలమాడెను.

“నీ వేళాకోళముల కేమిలే!”

“నావి వేళాకోళములు; తాను పారిపోవుట వీరవిక్రమమట. ఇంటికి చుట్టములు, స్నేహితులు వచ్చినచో పారిపోవు పెద్దమనిసితనము మా అన్నగారిది. ఆ శిల్ప మట్టిది, యీ శిల్ప మిట్టిది అని నీవు చెప్పనక్కర లేదా?”

“ఓ మగవీరుడు చెల్లీ, నీకు తెలియదా! నీ వేల చెప్పవైతివి? ఎవరో శుద్ధాంతకాంతా జనము వచ్చిరట! నేను వారియెదుటబడి యిది యిది, అది అది అని చెప్పవలెనట!

“ఎవ్వరికిని ఏమియు చెప్పనక్కరలేదులే శుద్ధాంతకాంతాజనము, వీరవిక్రమ విహారజనము ఎవరైన వచ్చినప్పుడు మా అన్నగారు లేడి పిల్లవలె బెదరి, చెంగున నురికి పొదలలో మాయమైపోవునట. ఈ ధైర్యమే కాబోలు మొన్న శకటపందెములో నెగ్గించినది.”

ఇంతలో సిద్ధార్థినిక వీరున్న తావునకు వచ్చినది.

సిద్ధా: అన్నా! నీ వెచ్చటికి పోయినావు? హిమబిందును, ఆమె అమ్మమ్మయు, ఆమె మేనత్తయు నాయనగారి బొమ్మలును, నీ బొమ్మలును దీక్షతో గమనించినారు. హిమబిందు అక్కను, నన్ను ఎన్ని ప్రశ్నలు వేసినదని! అక్కయెంతో చిత్రముగ మాట్లాడినది.

నాగ: నే నేమి చిత్రముగా మాట్లాడినానే? ఇంత వెఱ్ఱిదానవు. నాకు చెల్లెలివై పుట్టినా వేమే! హిమబిందు నిన్నట్లు ముద్దు పెట్టుకొనినప్పుడు నీ వంత సిగ్గుపడితివేమి?

సువర్ణ: ప్రపంచములో అందరును నీకు సిగ్గుపడువారే.

సువర్ణ శ్రీకుమారుడు భోజనమునకై దుకూలము ధరించి, అలంకార గృహమున కేగి యచ్చట మార్జనకునిచే తల దువ్వించుకొని, ముడి రచియింపించుకొని, పైన చీనాంబరమును కప్పుకొని తిలకము దిద్దుకొని, యీవలకు వచ్చునప్పటికి మహాలియు, శక్తిమతీదేవియు, సిద్ధార్థినికయు, నాగబంధునికయు ప్రత్యక్షమైరి.

నాగ:అమ్మా! అన్న భయపడి పారిపోయినాడే.

సిద్ధా:అన్న భయపడుటేమి! ఎవరో ఆడవారు వచ్చినారు గదాయని ఎచ్చటికో వెళ్ళినాడు.

నాగ: అవును. బెదరిన లేడివలె వెళ్ళినాడు.

శక్తి:ఊరుకోవే తల్లీ! కొత్తవారి యెదుటపడుటకు అన్నకు కొంత సిగ్గువేసిన, దాని నంతగడబిడ చేసెదవేమి?

నాగ: అన్న శిల్పములు చూచుటకు వారు వచ్చిరాయెను. పోనీ, నా స్నేహితురా లీయనకు క్రొత్తా? తన చుట్టును మేమందరము నాట్యము చేసితిమి కదా!

మహా:ఉండవమ్మా తల్లీ! అన్నగారి నట్లు దుయ్యపట్టుకొంటి వేమి? నీవు లేవా, అన్నియు చెప్పుటకు? వారు సువర్ణుని చూచుటకు వచ్చిరా, బొమ్మలు చూచుటకు వచ్చిరా?

సిద్దా: అమ్మా, అక్క యెప్పుడును నన్ను, అన్నను యీ విధముగానే వేళాకోళములు చేయుచుండునే. నాకు ఎప్పుడో కోపమువచ్చును. నేను నాన్నగారితో చెప్పితీరెదను.

అడివి బాపిరాజు రచనలు - 2

•71 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)