పుట:Himabindu by Adivi Bapiraju.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆతని కంఠము ఇంకను స్పష్టత తాల్చినది. మధురాభిషేకోచిత శంఖ వినిర్గత స్వనములై యాతని మాటలు వెలువడినవి.

“హిమబిందువా నీవు! ప్రపుల్లనీరేజహృదయస్థ ప్రాతఃకాల తుషార బిందువువా నీవు!”

అంత నాతని యా స్వప్న మధ్యమునుండి “బాలనాగీ దారి ఇమ్మనవే!” యన్న మాటలు వినవచ్చినవి. ఆతడులికిపడి తలయెత్తి స్వప్నలోకము పటాపంచలై మాయము కా, నెదుట హిమబిందుకుమారి నిజముగ నిలుచుండుట గమనించి సిగ్గునంది, చటుక్కున లేచి వెనుకకు తిరిగి పారిపోయినాడు.

26. రాగారుణచ్ఛాయలు

సువర్ణశ్రీకుమారుడు తన సౌధమున కెట్లెట్లో చేరెను. ధర్మనంది యిల్లు చతుశ్శాలాంతరమైన హర్మ్యము. ఈ హర్మ్యమునకు రెండు మేడలున్నవి. ఒకమేడ శుద్ధాంతజనము వసించునది. ఆ మేడ వెనుక స్త్రీజనాశ్రయమైన మండపగృహమును, సూతికాగృహమును ఉన్నవి. మేడల మీదకు పోవుటను రెండు సోపానపంక్తులు కలవు.

సువర్ణశ్రీకుమారుడు దక్షిణ సోపానపంక్తి నెక్కుచు సౌధములోని తన మందిరములోనికి పోయి యా మందిరముననున్న శయనాగారము చేరి పర్యంకమున బోర్లగిలపరుండి మహాచైత్యమందలి దివ్యదర్శనమును స్మరించుకొనుచు, భయపడుచు, ఉప్పొంగుచు వివిధాలోచనాధీనుడై జాగర స్వప్నవశుడైనాడు.

తనమాట ఆమె విని యున్మత్తునిగ భావించలేదుగదా! తా నట్లు చేసినాడేమి? తన ఇంటికి వచ్చిన యా బాలిక యింతటిలో నచ్చటి కెప్పుడు వచ్చినది? నిజముగ నామె యచ్చటికి వచ్చెనా? తలలోని కాంక్షయే యట్లురూపెత్తి వచ్చినదా? నిజముగ నామెయే వచ్చియుండవలయు. ఏలనన, యామెకు కొంచెము ఎడముగ వెనుక వేరొక్క బాలిక కనంబడినది. ఇంకను వెనుక దూరముగ నిరువురు వృద్ధ స్త్రీలమాటలు విననైనవి. తా నట్లు స్పష్టముగ ఉచ్చరించిన వాక్కుల విని యా దివ్యసుందరి నిజముగ తన్ను మతిహీనునిగ నెంచియుండును.

ఆమె పండు వెన్నెలలో పోతపోసిన స్వర్ణవిగ్రహమై సాక్షాత్కరించినది. ఆమె ఏమనుకొనిన నేమి? పూజా ద్రవ్యములే చెంతనున్నచో అట్టి యతిలోక సౌందర్యమునకు షోడశోపచారము లర్పించియుందునుగదా!

ఆమె యెక్కడ? తా నెక్కడ? వర్తకసామ్రాట్టయిన చారుగుప్తుని తనయ యేడ, దరిద్రశిల్ప బ్రాహ్మ కుమారుడైన తా నేడ?

మరల తన కా బాలిక సందర్శన మిచ్చునా? అతిలోక సౌందర్యమును పూజాపీఠిక నెక్కింపగోరని శిల్పియుండునా! ఆ దివ్యసౌందర్యము ఈ బీద యింటియందు వాసము చేయగలదా!

ఇంతలో అతనికి మహానసగృహమునుండి గంట విన్పించినది. తండ్రి గారి అర్చన పూర్తియైనదనుకొనుచు సువర్ణశ్రీ లేచి మేడమెట్లు దిగి స్నాన గృహమునకు పోయినాడు. పనికత్తె అచ్చట వేడినీళ్ళు తొలిపి పెట్టి యుంచినది. అంగ సంస్కారకుడు వచ్చి దేహమంతయు మార్జన నలంది ఉద్వర్తన మొనర్చి స్నానము జేయించినాడు,

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు(చారిత్రాత్మక నవల)
• 70 •