పుట:Himabindu by Adivi Bapiraju.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అసురులు హిమవన్నగ ప్రాంతీయులైన ప్రథమార్యులు. వారు హిమ వన్నగజములైన సింధు గంగా యమునా నదితీరముల మహానగరములు నిర్మించుకొని అచ్చటనున్న పచ్చిపొలసుదిండ్లను, నరమాంసభక్షకులను దక్షిణ దేశములకు దరిమి, యాప్రదేశములను లక్ష్మీపదముల గావించిరి.

ఆ అసురులకు తర్వాత హిమశైలీయులైన ఆర్యులు దక్షిణమునకు వలస వచ్చి, అచ్చట ఇదివరకే రాజ్యములు స్థాపించియున్న అసురులతో ఘోర యుద్ధములుచేసి, వారిని సింధునదీతీరమునుండి తరిమివేసిరి. అసురు లక్కడనుండి కదలి మెసపొటేమియా, ఈజిప్టులకు, భరతఖండ ప్రాకృశ్చిమ దక్షిణ తీరములకు సముద్రయానము చేయుచునో, తీరములవెంట ప్రయాణము చేయుచునో వచ్చి వలసలుపోయి రాజ్యము లేర్పరచుకొనిరి.

పరీక్షిత్తు కాలమున తూర్పుతీరములకు వచ్చిన ఆంధ్రార్యులు అదివరకే పూర్వ సముద్రతీరమున వాసముచేయు అసురార్యులతో యుద్ధములు సలిపి, అసురరాజుల నిర్జించి తామురాజులైరి. ఆ కాలముననే ఆంధ్రవిష్ణువు గాథ జన్మించినది.

ఆంధ్రవిష్ణువు వంశమువారే ఆంధ్ర శాతవాహనులు. ఈ గాథయే బృహత్కథయందు వర్ణితమైనది.

ఆ శాతవాహనవంశమందు ప్రియదర్శి తన పెదతండ్రికొమరుడును చక్రవర్తియు నగు అభయబాహునకు దక్షిణబాహువై, చండవిక్రముడై, మహాసేనాధిపతియై ఆంధ్ర రాజ్యము పడమటి తీరమునుండి ఉత్తరమున ఘూర్జరమువరకు గొనిపోయెను. మాళవము జయించి ఆంధ్రరాజ్యములోజేర్చెను. అభయ బాహువు ప్రతిష్ఠానమున ప్రియదర్శి శాతవాహనునే తనకు బ్రతినిధిగ నుంచెను.

ఆ దినములలో కోటీశ్వరుడగు వినయగుప్తుడు అభయబాహు సార్వభౌమునకు వామహస్తమై, తన వైభవమంతయు చక్రవర్తికి దాసిని జేసెను. ఆతడు ప్రియదర్శి శాతవాహనుని ఎక్కువగా ప్రేమించి ఆతని జైత్రయాత్రలలో సర్వవిధముల బాసటగా నుండెను. ప్రియదర్శిని ప్రేమించుటతో తృప్తిపడక తన కొమార్త అమృతలత నా వీరపుంగవునకు కన్యాదాన మొసంగెను.

సమదర్శిశాతవాహనుడు ప్రియదర్శికి ఏకపుత్రుడు. అమృతలతాదేవి కుమారుని యందు గాఢప్రేమతో, మాళవయుద్ధమందు వీరస్వర్గమందిన ప్రాణేశుడగు ప్రియదర్శిని తలంచుకొని ఆంధ్రసైన్యమునందు చేర సుతుడనుజ్ఞ వేడినప్పుడు సమ్మతినొసంగ నిరాకరించినది.

సమదర్శికి పదునేడవ ఏడు వచ్చినది. ఆయేటి మహాలయపక్షములలో అన్నగారి భవనమునకు కుమారునితో బోయిన అమృతలతాదేవికి స్వప్నమందు ప్రియదర్శి ప్రత్యక్షమై, “ఆత్మేశ్వరీ! నా పేరునకు, నాజాతికి, శాతవాహనవంశానికి అపఖ్యాతి తెచ్చుచున్నావా? ఇది నీకు ధర్మమా?” అని ప్రశ్నించుచు విచారవదనమున కనబడినాడట.

అంతియ. అమృతలతాదేవి ఆ మరుక్షణమునుండి సంపూర్ణముగ మారిపోయి, కుమారునికి సైన్యమునజేర ననుమతి యొసంగుటయేగాక, స్వయముగా శ్రీముఖచక్రవర్తి కడకుబోయి సమదర్శిని వేయికన్నుల గాపాడవలసినదనియు, నాతనికి సైన్యమున ముఖ్యోద్యోగములనిచ్చి యా బాలుని తండ్రియంత వాని జేయవలయుననియు బ్రార్థించెనట.


అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 49 •