పుట:Himabindu by Adivi Bapiraju.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“అలాగునా చెల్లీ!”

“అవును, నీ చెక్కడాలు చూచునట అన్నా! నాతోనే చెప్పినది. రా; నీ మందిరానికి పోదము రా, అన్నా!”

సిద్ధార్థినిక అన్నను చేయిబట్టి లాగినది. అతనికి ఏదియో భయము, ఏదియో ఆశ, ఏదియో త్రప కలిగినవి.

“చెల్లీ! నీవు పో! నేను వచ్చెదనులే!”

“అన్నా నీవు త్వరగా రావాలి.”

సిద్ధార్థినిక వెడలిపోవగనె, రేఖారహితమైన యాలోచనలు, మూర్తిరహితమగు స్వప్నములు అతని హృదయమున జన్మించుచున్నవి, మాయమగుచున్నవి.

ఆతడు వేయలేని బొమ్మలు, పాడలేని గీతాలు దూరాకాశనీలపథాలలో మేఘములై మందమందగతి పోయి మాయమైనవి.

17. హిమబిందుకుమారి

సమదర్శిశాతవాహనుడు మహారాజువంశమువాడు. సమదర్శితండ్రి ప్రియదర్శి శాతవాహనుడు. ఆతడు శ్రీముఖశాతవాహనుని తండ్రియగు అభయ భాహుశాతవాహనుని పినతండ్రి మనుమడు.

శాతవాహనులు ప్రాచీనకాలమందుననే ఆంధ్రదేశానికి ఉత్తరము నుండి ప్రయాణమై వచ్చిన బ్రాహ్మణులు. భారతయుద్దమైన వెనుక, దేశమున అనార్య జాతులవారైన నాగులు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, వానరులు, పిశాచులు, గుహ్యకులు మొదలగువారు విజృంభించి రాజ్యము లెన్నియో యాక్రమించు కొనిరి. ఆ దినములలో ఆర్య సంప్రదాయములపై అసహ్యత జనించి, సాంఘిక దురాచారాలను ఖండించి, సంఘసాంప్రదాయములందు ఎందరో మార్పులు తెచ్చినారు. అట్టి వారిలో విశ్వామిత్ర సంతతివారయిన ఆంధ్ర బ్రాహ్మణులను చంద్రవంశ క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మొదలగువా రుండిరి. వారందరు శైవపూజాధురంధరులు.

ఇట్లు కొన్ని సంవత్సరములు గడిచిన వెనుక పరీక్షిన్మహారాజు రాజయ్యెను. ఈయన పూర్వసంప్రదాయగాఢాభిమాని. పరీక్షిత్తు చండవిక్రముడై విజృంభించి అనార్షోద్యమ భూయిష్టములగు రాజ్యముల నాశము చేసి, వైదికాచారము పునరుద్ధరించి అనేకాశ్రమములలో యజ్ఞయాగాది క్రతువుల నొనరింపజేసి, తా నొనరించి నాగాదిజాతుల పొగరణచి వైచెను.

ఆతని దాడుల భరింపలేక ఆంధ్రులు కళింగదేశము వలసవచ్చిరి. ఆర్య జాతులవారైనను వారు అనార్షవాదులైనందున పరీక్షిత్తు వారిపై దండయాత్ర సలిపి, ఓడించి, దేశమునుండి తరిమివేసెను.

తూర్పు సముద్రతీరమున నదివరకే సింధునదీ ప్రాంతమునుండి రామాయణ కాలమునకు ముందుగనే వలసవచ్చియున్నవారు అసురులు. రాజ్యములు, ఆశ్రమములు స్థాపించి, ఆ తూర్పు తీరాననే పట్టణములు నిర్మించుకొని నాగరికత వృద్ధి చేసికొని యుండిరి.

అడివి బాపిరాజు రచనలు - 2

• 48 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)